హైదరాబాద్ లో భారీ వర్షం ... మొగులుకు చిల్లు.. మోకాల్లోతు వరద

హైదరాబాద్ లో భారీ వర్షం ...  మొగులుకు చిల్లు.. మోకాల్లోతు వరద

సిటీలో ఆదివారం సాయంత్రం మొగులుకు చిల్లు పడిందా అన్నట్టుగా భారీ వర్షం కురిసింది. రాత్రి 11 గంటల వరకు అత్యధికంగా ముషీరాబాద్​లో 12.40 సెంటిమీటర్లు, కాప్రాలో 10.58, మారేడ్​పల్లిలో 10.15, షేక్​పేటలో 9.48, హిమాయత్​నగర్​ 9.03, ఉప్పల్​లో 8.88 సెం.మీ. వాన పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు, కాలనీల్లోకి వరద నీరు చేరింది. పలుచోట్ల సెల్లార్లు నీటితో నిండిపోయాయి. ఐటీ కారిడార్​లోనూ వర్షం ప్రతాపం చూపింది. 

ఆదివారం ఐటీ ఉద్యోగులకు సెలవు కావడంతో ట్రాఫిక్ ముప్పు తప్పింది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 కమాండ్ కంట్రోల్ వద్ద వరద నదిని తలపించింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పాట్​కు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్ బోర్టు అధికారులు, సిబ్బంది సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు.
 

మంత్రి పొన్నం ప్రభాకర్ టెలికాన్ఫరెన్స్ 

సిటీలో కురుస్తున్న భారీ వానలపై వివిధ విభాగాల అధికారులతో హైదరాబాద్ ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ రాత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఇబ్బందులున్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ , హైడ్రా  బృందాలు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇండ్లలోంచి బయటకు రాకూడదాని సూచించారు. ఇబ్బందులు ఎదురైతే జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.