
పాక్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ ఇజ్జత్ పొగుట్టుకున్నడు. టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్ సైమ్ అయూబ్ ఆరు బంతులకు ఆరు సిక్సులు కొడతాడని పాక్ మాజీ ప్లేయర్ తన్వీర్ అహ్మద్ ఇండియా, పాక్ మ్యా్చ్ ముందు ప్రగల్భాలు పలికిన విషయం తెలిసిందే. కానీ మ్యాచులో సీన్ రివర్స్ అయ్యింది. సైమ్ అయూబ్ ఆరు బంతులకు ఆరు సిక్సులు కాదు కదా కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండానే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇక్కడ మరో హైలెట్ ఏంటంటే.. పాక్ ఇన్నింగ్స్ తొలి బంతికే సైమ్ అయూబ్ ఔట్ కావడం. హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో అది కూడా బుమ్రానే క్యాచ్ పట్టడం.
ఇక.. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు ఇండియా, పాక్ మ్యాచ్ మొదలైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో పాక్ టాస్ గెలిచింది. దీంతో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ టాస్ గెలిచిన ఆనందం పాక్‌కు ఎంతో సేపు నిలువలేదు.
ఇన్సింగ్స్ తొలి బంతికే పాక్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్ ఔట్ అయ్యాడు. హర్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో బుమ్రా క్యాచ్ పట్టడంతో అయూబ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ షాక్ నుంచి తేరుకోకముందే పాక్‌కు వెంటనే మరో ఎదురు దెబ్బ తగిలింది. బుమ్రా వేసిన రెండో ఓవర్లో మహ్మద్ హరీస్ (3) ఔట్ అయ్యాడు.
దీంతో రెండు ఓవర్లలోనే దాయాది దేశం రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సీనియర్ బ్యాటర్ ఫఖర్ జమాన్, సాహిబ్జాదా ఫర్హాన్ కాసేపు వికెట్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. కానీ అక్షర్ పటేల్‌లో బౌలింగ్‌లో ఫఖర్ జమాన్ (17) వెనుదిరిగాడు. దీంతో ఫస్ట్ టెన్‌లో పాక్ మూడు వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సాహిబ్జాదా ఫర్హాన్ (22), కెప్టెన్ సల్మాన్ అఘా (3) ఉన్నారు.