
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతల స్వీకరణ
- చనిపోయిన ఆందోళనకారులకు అమరవీరులుగా గుర్తింపు
న్యూఢిల్లీ: తాము అధికారాన్ని అనుభవించేందుకు రాలేదని, తనకు, తన టీమ్‌కు ఆ ఆసక్తి లేదని నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కర్కీ పేర్కొన్నారు. ఆరు నెలల్లో కొత్త పార్లమెంట్‌కు దేశ బాధ్యతలను అప్పగిస్తామని వెల్లడించారు. నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీలా కర్కీ ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆరు నెలలకు మించి తాము ఈ పదవిలో ఉండబోమని తెలిపారు.
ప్రజలకు సేవ చేయడానికే బాధ్యతలు చేపట్టామని అన్నారు. నేపాల్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉందని, దేశ పునర్నిర్మాణం, ఆర్థిక స్థిరత్వమే తమ ప్రాధాన్యతా అంశమని తెలిపారు. దేశ పునర్నిర్మాణానికి ప్రజలందరి సహకారం అవసరమని, వారి మద్దతు లేకుండా విజయం సాధించలేమని అన్నారు.
‘జెన్ జడ్’ ఉద్యమానికి ప్రశంస
అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ‘జెన్ జడ్’ ఉద్యమాన్ని సుశీలా కర్కీ ప్రశంసించారు. ‘‘ఈ ఆందోళనలు కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని కూల్చివేశాయి. ఇందులో మరణించిన వారిని అమరవీరులుగా గుర్తిస్తం. ఒక్కో కుటుంబానికి 10 లక్షల నేపాలీ రూపాయలు పరిహారంగా అందిస్తం. గాయపడిన వారి చికిత్స ఖర్చులను తాత్కాలిక ప్రభుత్వం భరిస్తుంది. అలాగే వారికి ఆర్థిక సహాయం కూడా అందిస్తాం” అని తెలిపారు.
కేవలం 27 గంటల ఆందోళనల్లో ఇంత పెద్ద మార్పును తానెప్పుడూ చూడలేదని అన్నారు. మనమందరం కలిసి దృఢ నిశ్చయంతో పని చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ఇతర ఆస్తుల ధ్వంసంపై తాత్కాలిక ప్రభుత్వం దర్యాప్తు చేపడుతుందని తెలిపారు. ఆస్తి నష్టం జరిగిన వారికి పరిహారం అందిస్తామని చెప్పారు. ఆందోళనల పేరుతో కొన్ని సంఘటనలు ప్రణాకాబద్ధంగా జరిగినట్టు కనిపిస్తున్నదని, వ్యక్తిగత ఆస్తులను ధ్వంసం చేసినవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.