
- ప్రజలతోనే తన బాధలు చెప్పుకుంటానని వెల్లడి
- తిట్లను గొంతులో దాచుకుంటానన్న ప్రధాని
- దేశ వ్యతిరేక శక్తులను
- కాంగ్రెస్ కాపాడుతున్నది
- ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇది బయటపడిందని ఫైర్
- దరంగ్‌లో ప్రధాని పర్యటన..
- పలు అభివృద్ధి పనుల ప్రారంభం
గువాహటి: తాను శివ భక్తుడినని.. తిట్లను విషంలా గొంతులోనే దాచుకుంటానని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలే తన యజమానులు, రిమోట్ కంట్రోల్ అని, అందుకే వారి ఎదుటే తన బాధను వ్యక్తపరుస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్–ఆర్జేడీ సభా వేదికపై మోదీతోపాటు ఆయన తల్లి తల్లి హీరాబెన్‌ను లక్ష్యంగా చేసుకొని కొందరు దుర్భాషలాడారనే వివాదం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అస్సాంలో పర్యటించారు.
అక్కడ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా దరంగ్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్పరివారం మొత్తం నన్ను టార్గెట్ చేసిందని తెలుసు. మోదీ ఏడుస్తారని వాళ్లు అనుకుంటున్నారు. ప్రజలే నా దేవుళ్లు. నేను వారిముందు నా బాధను వ్యక్తం చేయకపోతే.. ఎక్కడ చేస్తా? వారే నా యజమానులు, వారే నా రిమోట్‌కంట్రోల్. నాకు వేరే రిమోట్ కంట్రోల్లేదు”అని వ్యాఖ్యానించారు.
పాక్ అబద్ధాలే కాంగ్రెస్ అజెండా
1962లో చైనాతో యుద్ధం తర్వాత నాటి ప్రధాని నెహ్రూ ఈశాన్య ప్రాంత ప్రజలకు చేసిన గాయాలు నేటికీ మానిపోలేదని ప్రధాని మోదీ అన్నారు. నేటికీ ఆ గాయాలపై కాంగ్రెస్ ఉప్పు చల్లుతున్నదని మండిపడ్డారు. ఆ పార్టీ తన స్వార్థ రాజకీయాల కోసం భారత్‌పై వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తుల (పాకిస్తాన్ )తో జట్టు కట్టిందని విమర్శించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కాంగ్రెస్ గుట్టుబయటపడిందన్నారు. ‘‘కాంగ్రెస్ పాలనలో ఉగ్రదాడులపై ఆ పార్టీ మౌనంగా ఉండేది. ఆపరేషన్ సిందూర్‌తో ఇప్పుడు మన దళాలు పాకిస్తాన్‌లోని ప్రతి మూల నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం పాకిస్తాన్ సైన్యానికి మద్దతుగా నిలుస్తున్నది.
పాక్ అబద్ధాలే కాంగ్రెస్ అజెండాగా మారుతున్నాయి” అని పేర్కొన్నారు. దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ రక్షణ కవచంలా మారిందని, అందుకే ఎల్లప్పుడూ కాంగ్రెస్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గాయకుడు భూపెన్ హజారికాకు భారతరత్న ఇస్తే కాంగ్రెస్ పార్టీ అవమానించిందని చెప్పారు. అస్సాంను కాంగ్రెస్ దశాబ్దాలపాటు పాలించినా.. బ్రహ్మపుత్ర నదిపై కేవలం 3 వంతెనలను మాత్రమే నిర్మించిందని అన్నారు. కానీ.. తాము అధికారంలోకి వచ్చాక ఒకే దశాబ్దంలో 6 కొత్త వంతెనలను నిర్మించామని చెప్పారు. అందుకే అస్సాం ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని తెలిపారు.
ఇవాళ బిహార్‌లో మోదీ పర్యటన
బిహార్‌లోని పూర్నియా జిల్లాలో ప్రధాని మోదీ సోమవారం పర్యటించనున్నారు. రూ.36 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను, ఉత్తర బిహార్ పట్టణంలో కొత్తగా అభివృద్ధి చేసిన విమానాశ్రయ టెర్మినల్‌ను ప్రారంభిస్తారు. అలాగే, బడ్జెట్‌లో ప్రకటించిన పూల్‌మఖానా బోర్డు ప్రారంభోత్సవంలో మోదీ పాల్గొంటారు. అనంతరం నిర్వహించే ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.