
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్నగరానికి తాగునీరు అందించే ప్రధాన జలాశయాలైన సింగూరు, మంజీరాకు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. సింగూర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి 15 వేల క్యూసెక్కులు వరద నీరు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో ఆదివారం మంజీరా బ్యారేజీ 7 గేట్లు, సింగూరు ఒక గేటును ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ముఖ్యంగా మంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పశువులు, గొర్ల కాపరులు, చేపల వేటకు పోయే వారు నదిలోనికి వెళ్లవద్దన్నారు. మంజీరాలోకి ఇన్‌ఫ్లో 9,676 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 15,679 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. సింగూరు ఇన్‌ఫ్లో 12,603 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 9,675 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. మంజీరా ఫుల్ట్యాంక్ లెవెల్ 1,500 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 1206 టీఎంసీలు ఉంది. సింగూరు ఫుల్ట్యాంక్ లెవెల్ 29.917 టీఎంసీలకు ప్రస్తుతం 17.593 టీఎంసీల నీరు ఉంది.