
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రక్షణ శాఖను మరింత పటిష్టంగా తయారు చేసేందుకు నడుంబిగించింది. భవిష్యత్తులో ఎప్పుడు యుద్ధం వచ్చినా.. శత్రువులు ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వినా భారత సత్తా ఏంటో చూపించే లక్ష్యంతో ముందుకెళ్తోంది. అందులో భాగంగా ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు మరో లక్ష కోట్లు కేటాయించడం శత్రు దేశాలకు షాక్ ఇచ్చే న్యూస్.
శుక్రవారం (జులై 04) డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) మిలిటరీ హార్డ్ వేర్ కు సంబంధించి 10 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అందులో భాగంగా రక్షణ శాఖకు లక్ష కోట్ల రూపాయలు కేటాయించేందుకు అంగీకరించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇది. అదే విధంగా బడ్జెట్ కేటాయింపులు కాకుండా రక్షణ రంగానికి ప్రత్యేకంగా ఇంతపెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం పొరుగు దేశాలకు ఆందోళన కలిగించే అంశమే.
2025-26 బడ్జెట్ లో రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు చేసింది భారత ప్రభుత్వం. 2025-26 మొత్తం బడ్జెట్ రూ. 50,65,345 కోట్లు కాగా.. రక్షణ శాఖకు రూ. 6.81 లక్షల కోట్లు కేటాయించింది. లేటెస్ట్ గా మరో లక్ష కోట్ల రూపాయలకు ఆమోదం తెలపడం విశేషం. దీంతో రానున్న రోజుల్లో భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా తయారవుతుందనటంలో సందేహం లేదు.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. అత్యవసర అంగీకారం కింద ఈ అదనపు బడ్జెట్ ను కేటాయించేందుకు ఆమోదం లభించింది. త్రివిధ దళాలకు కొత్త ఆయుధాల సేకరణ, ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టం, కొత్త ఆయుధాల తయారీ తదితర అవసరాల కోసం బడ్జెట్ కేటాయించనున్నారు. భూమి నుంచి గాలిలో దాడి చేసే మిస్సైళ్లను భారీ ఎత్తున సేకరించనున్నారు.
ALSO READ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి : విజయ్
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత రక్షణ శాఖ ఏర్పాటు చేసిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ తొలి మీటింగ్ కావడం గమనార్హం. ఈ సందర్భంగా మంత్రి రాజ్ నాథ్ మాట్లాడుతూ.. ‘‘ త్రివిధ దళాలు ఏ సంయంలోనైనా ముందస్తు ప్రణాళిక కోసం ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది. దీని వలన సప్లై చైన్ మెరుగవుతుంది, ఎయిర్ డిఫెన్స్ మరింత ప్రభావితంగా పనిచేస్తుంది. రక్షణ రంగం మరింత బలపడుతుంది’’ అని అన్నారు.
నేల నుంచి గాలిలో ధ్వంసం చేసే మిస్సైళ్లను (Quick Reaction Surface-to-Air Missile (QRSAM)) సమకూర్చుకోవడం వలన పాకిస్తాన్ బార్డర్ లో ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరింత బలపడుతుందని మంత్రి తెలిపారు. అదే విధంగా నావికా దళంలో కూడా జలాంతర్గాముల బలాన్ని పెంచుకునేందుకు బడ్జెట్ ను పెంచుతున్నట్లు తెలిపారు.