వైష్ణోదేవీ ఆలయ మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు.. ఐదుగురు మృతి.. 14 మందికి గాయాలు

వైష్ణోదేవీ ఆలయ మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు.. ఐదుగురు మృతి.. 14 మందికి గాయాలు

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రియాసి జిల్లాను కుండపోత వాన ముంచెత్తింది. ఈ క్రమంలోనే శ్రీ మాతా వైష్ణో దేవి మందిరానికి వెళ్లే మార్గంలోని అర్ధ్‌కువారి ఇంద్రప్రస్థ భోజనాలయ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగంలోకి దిగిన సహయక బృందాలు ఘటన స్థలంలో రెస్య్కూ ఆపరేషన్ చేపట్టాయి. తీవ్రంగా గాయపడిన యాత్రికులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

శిథిలాల కింది నుంచి రెండు మృతదేహాలను వెలికితీసి కాట్రా ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలంలో ఆర్మీ యుద్ధ ప్రాతిపదిక సహయక చర్యలు చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. వైష్ణో దేవి ఆలయ బోర్డు పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. యాత్రికుల భద్రత దృష్ట్యా వైష్ణో దేవి యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది ఆలయ బోర్డు. భక్తులు ఆందోళన చెందకుండా.. బోర్డు మార్గదర్శకాలు పాటించాలని సూచించింది.

జమ్మూ కాశ్మీర్‌లోని కథువా, సాంబా, దోడా, జమ్మూ, రాంబన్, కిష్త్వార్ సహా అనేక జిల్లా్ల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దోడా జిల్లాలో క్లౌడ్ బరస్ట్ వల్ల నలుగురు మృతి చెందగా.. కొందరు వరదలో గల్లంతయ్యారు. ఇండ్లు, ఆసుపత్రులు, హోటల్స్ వరదల్లో కొట్టుకుపోయాయి. భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం దృష్ట్యా జమ్మూ డివిజన్ అంతటా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు.

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ-శ్రీనగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు తావి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పాటు అనేక నదులు, వాగులలో నీటిమట్టం ఇప్పటికే ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది.

ఇవాళ (మంగళవారం ఆగస్ట్ 26) రాత్రి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. నదులు, చెరువులు, కుంటలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు అధికారులు. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురువడం, పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.