తొమ్మిదేండ్లలో రాష్ట్రానికి..5 లక్షల కోట్లు ఇచ్చినం

తొమ్మిదేండ్లలో రాష్ట్రానికి..5 లక్షల కోట్లు ఇచ్చినం
  • పన్నుల వాటా కిందనే రూ.1.78 లక్షల కోట్లు: కిషన్ రెడ్డి  
  • నేషనల్ హైవేలకు లక్ష కోట్లు.. ట్రిపుల్​ ఆర్​కు 21 వేల కోట్లు
  • రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ 

హైదరాబాద్, వెలుగు:  ఈ తొమ్మిదేండ్లలో రాష్ట్రానికి మొత్తం రూ.5 లక్షల కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘మేం అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాష్ట్రాలకు పన్నుల్లో వాటా 42 శాతానికి పెంచినం. 2014 వరకు రాష్ట్రాలకు పన్నుల్లో వాటా కేవలం 32 శాతం ఉంటే, దాన్ని ఏకంగా 10 శాతం పెంచినం. ఈ తొమ్మిదేండ్లలో రాష్ట్రానికి పన్నుల వాటా కిందనే రూ.1.78 లక్షల కోట్లు వచ్చాయి. రాష్ట్రాల సహకార సమాఖ్య స్ఫూర్తికి ప్రధాని మోదీ పెద్దపీట వేశారని చెప్పడానికి ఇదే నిదర్శనం” అని చెప్పారు. జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రానికి రూ.15,329 కోట్లు ఇచ్చినట్టు పేర్కొన్నారు. 

రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై శనివారం హైదరాబాద్ లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ‘ఎ రిపోర్టు టు పీపుల్’ పేరుతో కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్  ఇచ్చారు. కేంద్రం ఏ శాఖ ద్వారా ఎన్ని నిధులు ఇచ్చింది? ఏ సంస్థ ద్వారా ఎన్ని అప్పులు ఇచ్చింది? అనే వివరాలను ఆయన వెల్లడించారు.‘‘ఇది ఏ రాజకీయ పార్టీనో, మరెవరినో విమర్శించడానికి కాదు. దీనికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. కేవలం తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది? ఎంత అభివృద్ధి చేసింది? అనేది చెప్పడానికే” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్, ఎంపీ విజయేంద్ర ప్రసాద్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పాల్గొన్నారు. 

ఎరువుల సబ్సిడీ కింద రూ.33 వేల కోట్లు.. 

రాష్ట్రంలో పెండింగ్​లో ఉన్న 11 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ.2,200 కోట్లు ప్రత్యేక నిధులు మంజూరు చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘రాష్ట్రంలో విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేసేందుకు ఐపీడీఎస్ కింద రూ.394.19 కోట్లు, డీడీయూజీజేవై కింద రూ.278 కోట్లను విడుదల చేసినం. రూ.10,998 కోట్లతో రామగుండం ఎన్టీపీసీని నిర్మించినం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ.4,466  కోట్లు ఇచ్చినం. మొత్తం 2.50 లక్షల ఇండ్లు మంజూరు కాగా.. 2.23 లక్షల ఇండ్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ మెట్రో రైలు కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ.1, 458 కోట్లు కేటాయించగా, రూ.1,204 కోట్లను ఇప్పటికే విడుదల చేసినం. జల్ జీవన్ మిషన్ కింద రూ.1,588 కోట్లు, ఎరువుల సబ్సిడీ కింద రూ.33 వేల కోట్లు ఖర్చు చేసినం. రూ.1,366 కోట్లతో ఎయిమ్స్ తో పాటు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసినం. ఈఎస్ఐ డిస్పెన్సరీల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం రూ.2,199.22 కోట్లు కేటాయించినం” అని  కిషన్ రెడ్డి వివరించారు.

ఇచ్చిన అప్పులు  9.81 లక్షల కోట్లు.. 

కరోనా టైమ్ లో రాష్ట్రానికి రూ.6,950 కోట్ల రుణం ఇచ్చామని, అది తామే భరించామని కిషన్ రెడ్డి చెప్పారు. బడ్జేటేతర రుణాలతో సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రానికి రూ.9.81 లక్షల కోట్ల అప్పులు ఇచ్చాయని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలకు వ్యక్తిగత రుణాల కింద రూ.9. 26 లక్షల కోట్లు ఇచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కోసం రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల అభివృద్ధి నిధుల కింద 16, 17వ లోక్ సభ కాలంలో రాష్ట్రంలోని ఎంపీలకు  రూ.983 కోట్లు అందాయని, అందులో ఇప్పటికే రూ.735 కోట్లు ఖర్చు అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.2,250 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు.

రైల్వే లైన్ల డబ్లింగ్ కు రూ.37 వేల కోట్లు.. 

రాష్ట్ర అభివృద్ధి విషయంలో తాము చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని, గుజరాత్ కంటే తెలంగాణలో రోడ్ల నిర్మాణానికే ఎక్కువ నిధులు ఖర్చు చేశామని కిషన్ రెడ్డి చెప్పారు. ‘‘రాష్ట్రంలో 2014 వరకు 2,512  కిలోమీటర్ల మేర నేషనల్ హైవేలు ఉంటే, మేం ఈ తొమ్మిదేండ్లలోనే  2,500 కిలోమీటర్ల మేర నిర్మించాం. ఇందుకోసం రూ.1.08 లక్షల కోట్లు ఖర్చు చేశాం. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) కోసం రూ. 21,201 కోట్లు కేటాయించినం” అని తెలిపారు. రాష్ట్రంలో రైల్వే లైన్ల డబ్లింగ్ కోసం రూ.37 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు. ‘‘దేశవ్యాప్తంగా 18 వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టగా, అందులో రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించినం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఎయిర్ పోర్టు తరహాలో పునర్నిర్మించేందుకు రూ. 715 కోట్లు, చర్లపల్లి టర్మినల్ కు రూ. 221 కోట్లు కేటాయించినం. ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ కోసం రూ.1,153 కోట్లను విడుదల చేయగా, రాష్ట్రం తన వాటాలో కేవలం రూ. 279 కోట్లు మాత్రమే విడుదల చేసింది” అని పేర్కొన్నారు. హైదరాబాద్ లో రూ.353 కోట్లతో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ( సీఏఆర్వో) ఏర్పాటు చేస్తున్నామన్నారు.