డీజీపీకి సోమేశ్ తీర్పే వర్తిస్తుంది: హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం

డీజీపీకి సోమేశ్ తీర్పే వర్తిస్తుంది: హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: డీజీపీ అంజనీ కుమార్ ఏపీ కేడర్ అధికారే అని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. డీజీపీతో పాటు మరో ఐదుగురు సెంట్రల్ సర్వీసెస్ ఆఫీసర్లయిన రొనాల్డ్ రోస్, జే.అనంతరాము, ఎస్ఎస్.రావత్, అమ్రపాలి, అఖిలాస్ బిస్లాకు గతంలో సోమేశ్ కుమార్ కేసులో ఇచ్చిన తీర్పునే వర్తింపజేయాలని కోరింది. తెలంగాణకు తొలి సీఎస్​గా చేసిన సోమేశ్ కుమార్ ఏపీ కేడర్ ఆఫీసర్ అంటూ హైకోర్టు తీర్పు చెప్పిందని, అదే తరహా తీర్పు డీజీపీతో పాటు మరో ఐదుగురు అధికారులకు వర్తింపజేయాలని విన్నవించింది. 

మరో ఆరుగురు అధికారుల కేసుల్లో వ్యక్తిగత అంశాలు ఉన్నందున వాటిపై విచారణ జరిపితే తమ వాదనలు తెలియజేస్తామని చెప్పింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ బి.నరసింహ శర్మ బుధవారం వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజన టైమ్​లో కేంద్ర సర్వీస్ ఆఫీసర్ల విభజనకు ప్రత్యూశ్​కుమార్ సిన్హా కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఏపీ, తెలంగాణలకు కేంద్ర సర్వీస్ అధికారులు విభజించడంపై పలువురు ఆఫీసర్లు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్)లో సవాల్ చేసి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. 

తెలంగాణలోనే విధులు నిర్వహిస్తున్నారు. క్యాట్ తీర్పును రద్దు చేయాలని కేంద్రం దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు జడ్జీలు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ జే.అనిల్​కుమార్​తో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. కేంద్ర ప్రభుత్వ వాదనలపై ప్రతివాదులైన 12 మంది ఆఫీసర్లు తమ వాదనలతో అఫిడవిట్లను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.