సీఈసీ, ఈసీల నియామకంపై .. రాజ్యసభలో కేంద్రం బిల్లు

సీఈసీ, ఈసీల నియామకంపై .. రాజ్యసభలో కేంద్రం బిల్లు
  • అభ్యంతరం తెలిపిన ప్రతిపక్షాలు
  • సుప్రీంకోర్టు తీర్పును నీరుగార్చే ప్రయత్నమని విమర్శ
  • ఈసీని ప్రధాని చేతిలో కీలుబొమ్మగా మారుస్తున్నారని ఆరోపణ


న్యూఢిల్లీ: చీఫ్​ ఎలక్షన్  కమిషనర్(సీఈసీ), ఎలక్షన్  కమిషనర్(ఈసీ) ల నియామకంపై కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సీఈసీ, ఈసీలను నియమించే ప్యానెల్ లో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ని తొలగించి క్యాబినెట్ మంత్రిని చేర్చాలని కేంద్రం ఈ బిల్లులో ప్రతిపాదించింది. ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంపై పార్లమెంటు చట్టం చేసే వరకు ప్రధాని నేతృత్వంలోని లోక్ సభలో ప్రతిపక్ష నేత, సీజేఐతో కూడిన సంఘం సీఈసీ, ఈసీలను నియమిస్తుందని సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో పేర్కొంది. దీంతో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. 

తాజా బిల్లు ప్రకారం సీఈసీ, ఈసీలను నియమించే ప్యానెల్ లో ప్రధాని, లోక్ సభలో ప్రతిపక్ష నేత, కేంద్ర క్యాబినెట్ మంత్రి ఉంటారు. ఈ ప్యానెల్ కు ప్రధాని చైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు. ప్రధానే ఈ ప్యానెల్ ను నామినేట్  చేస్తారు. అయితే, ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరం తెలిపాయి. మార్చిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను నీరుగార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించాయి. కాగా, సీఈసీ, ఈసీల నియామకాలను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరుచేయాలని సుప్రీంకోర్టు మార్చిలో పేర్కొంది. 

ప్రధాని, లోక్ సభలో ప్రతిపక్ష నేత, సీజేఐతో కూడిన కమిటీ సూచన మేరకు సీఈసీ, ఈసీలను రాష్ట్రపతి నియమించాలని జస్టిస్ కేఎం జోసెఫ్  నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన బెంచ్  ఆదేశించింది. ఈ విషయంపై పార్లమెంటు చట్టంచేసే వరకు ఈ తీర్పు అమల్లో ఉంటుందని బెంచ్  తెలిపింది.

బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకం
బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని సీనియర్  అడ్వొకేట్  ప్రశాంత్ భూషణ్  అన్నారు. ఒకవేళ ఈ బిల్లు పార్లమెంటులో పాస్ అయినా సుప్రీంకోర్టు అడ్డుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. తనకు నచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన ఏ ఉత్తర్వును అయినా కేంద్రం తిరగరాస్తుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్   అన్నారు. తాజా బిల్లుతో ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉందని, ఇది ప్రమాదకర పరిణామమని ఆయన ట్వీట్  చేశారు. తాజా బిల్లు ద్వారా ఇద్దరు బీజేపీ సభ్యులను, ఒక కాంగ్రెస్  సభ్యుడిని ప్యానెల్ లో చేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. 

ప్రధాని చేతిలో ఎన్నికల సంఘాన్ని కీలుబొమ్మగా మార్చేందుకే తాజా బిల్లును కేంద్రం ప్రవేశపెట్టిందని కాంగ్రెస్  జనరల్  సెక్రటరీ కేసీ వేణుగోపాల్  విమర్శించారు. ‘‘సీఈసీ, ఈసీల నియామకంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఏం చేస్తారు? తమకు అనుకూలంగా ఉండే ఎలక్షన్  కమిషనర్​ను నియమించాలని ప్రధాని ఎందుకు అనుకుంటున్నారు? ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం, నిరంకుశం, అన్యాయం” అని వేణుగోపాల్ ట్విటర్​లో వ్యాఖ్యానించారు. ఈ బిల్లుతో ఎన్నికల సంఘాన్ని మోదీ, అమిత్ షా తమ అధీనంలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నారని కాంగ్రెస్  ఎంపీ మాణిక్కం ఠాగూర్  ఆరోపించారు.