రాష్ట్రాల్లో పంట మార్పిడి తప్పదు

రాష్ట్రాల్లో పంట మార్పిడి తప్పదు

ఈ ఖరీఫ్ సీజన్లో 40 లక్షల టన్నుల బియ్యం (60 లక్షల టన్నుల వరి ధాన్యం) సేకరించేందుకు ఇప్పటికే కేంద్రం అంగీకారం తెలిపినట్లు కేంద్ర ప్రభుత్వ  వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ సేకరణను మరింత పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపినట్లు సమాచారం. 

‘గత రబీ సీజన్లో పండిన పార్ బాయిల్డ్ రైస్ 44.7 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొంటామని చెప్పాం. అందులో ఇంకా మిగిలి ఉన్న పార్ బాయిల్డ్ రైస్ సేకరణ కొనసాగుతోంది. దేశంలో పార్ బాయిల్డ్ రైస్‎కి ప్రస్తుతం డిమాండ్ లేదు. ఈ తరహా రైస్‌ను వినియోగించే రాష్ట్రాలు స్వయంగా సమకూర్చుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇకమీదట పార్ బాయిల్డ్ రైస్ సేకరణ కుదరదని తెలంగాణ ప్రభుత్వానికి చెప్పాం. అందుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది. దేశవ్యాప్తంగా వరి, గోధుమ పంటల దిగుబడి దేశీయ అవసరాలకు మించి జరుగుతోంది. గోధుమ పండించే చాలా రాష్ట్రాల్లో వరి కూడా సాగు చేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం పప్పు దినుసులు, నూనె గింజలకు డిమాండ్ చాలా ఉంది. వాటిని ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లోనే పంట మార్పిడి చేసి పప్పు దినుసులు, నూనె గింజల సాగు చేయమని అన్ని రాష్ట్రాల రైతులను కోరుతున్నాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళు పోతే ఆహార ధాన్యాలు నిల్వ చేయడానికి కూడా స్థలం ఉండదు. పంజాబ్ రాష్ట్రంలో వరి పండించినంతగా వినియోగం ఉండదు. అక్కడ 90% సేకరణకు కారణమిదే. తెలంగాణ రాష్ట్రంలో స్థానికంగా ప్రజలు వరి వినియోగిస్తారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకిరాని ఇతర వినియోగదారులు కూడా ఉంటారు. ఏ విషయంలోనూ రాష్ట్రాలను కేంద్రం ఒత్తిడి చేయదు. వాస్తవ పరిస్థితికి అనుగుణంగా చర్చలు జరిపి ఏకాభిప్రాయం కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది. తదుపరి రబీ సీజన్లో ఎంత కొంటామనేది రాష్ట్రాలో సమావేశం జరిపి, దిగుబడి అంచనాలను చూసి నిర్ణయం తీసుకుంటాం’ అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.