గాజాకు మన సాయం.. 38.5 టన్నుల మందులు, డిజాస్టర్ మెటీరియల్​ను పంపిన కేంద్రం

గాజాకు మన సాయం.. 38.5 టన్నుల మందులు, డిజాస్టర్ మెటీరియల్​ను పంపిన కేంద్రం
  • ఈజిప్టుకు ఐఏఎఫ్ విమానం
  •     బార్డర్​ మళ్లీ మూసేసిన ఇజ్రాయెల్
  •     20 ట్రక్కులే గాజాలోకి ప్రవేశం 

న్యూఢిల్లీ/గాజా/జెరూసలెం: ఇజ్రాయెల్ దిగ్బంధం, బాంబుదాడులతో తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిన పాలస్తీనియన్లకు మానవతా సాయంగా మన దేశం నుంచి మందులు, ఇతర అత్యవసర వస్తువులను కేంద్ర ప్రభుత్వం పంపింది. వాయుసేన కార్గో విమానం ‘ఐఏఎఫ్ సీ17’లో 6.5 టన్నుల మందులు, 32 టన్నుల డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్ ను పాలస్తీనాకు పంపినట్లు ఆదివారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ విమానం ఈజిప్టులోని ఎల్ అరిష్ ఎయిర్ పోర్టుకు బయలుదేరిందని, అక్కడి నుంచి సరుకులు రఫా బార్డర్ క్రాసింగ్ ద్వారా గాజాలోకి చేరుతాయని ఆయన తెలిపారు. కేంద్రం పంపిన సాయంలో మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాలను కాపాడే మందులు, సర్జికల్ ఐటమ్స్, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్ లు, టార్పాలిన్ లు, నీళ్లను శుద్ధి చేసే ట్యాబ్లెట్లు, ఇతర రిలీఫ్ మెటీరియల్ ఉన్నాయన్నారు. పాలస్తీనా అథారిటీ ప్రెసిడెంట్ మహ్మద్ అబ్బాస్​తో ప్రధాని మోదీ మూడు రోజుల కిందట ఫోన్​లో మాట్లాడారు. పాలస్తీనియన్లకు మానవతా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కేంద్రం రిలీఫ్ మెటీరియల్ ను పంపించింది. 

20 ట్రక్కులు దాటంగనే బార్డర్ క్లోజ్

ఈజిప్టు నుంచి రఫా బార్డర్ క్రాసింగ్ ద్వారా గాజాలోకి 20 ట్రక్కులు మాత్రమే ప్రవేశించాయి. పాలస్తీనియన్లకు మందులు, ఫుడ్, ఇతర అత్యవసర వస్తువులతో దాదాపు 200 ట్రక్కులు ఈజిప్ట్, గాజా బార్డర్ (రఫా క్రాసింగ్) వద్ద కొన్ని రోజులుగా ఆగిపోయాయి. అమెరికా ఒత్తిడితో బార్డర్ ఓపెన్ చేసిన ఇజ్రాయెల్.. శనివారం 20 ట్రక్కులనే గాజాలోకి అనుమతించింది. ఆ తర్వాత క్రాసింగ్​ను మళ్లీ క్లోజ్ చేసింది. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పాలస్తీనియన్లకు ఈ 20 ట్రక్కుల సరుకులు ఏమూలకూ సరిపోవని ఐక్యరాజ్యసమితికి చెందిన  ‘ఓచా’ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో మరణించిన వారి సంఖ్య 4,741కి పెరిగిందని ఆదివారం పాలస్తీనా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. సుమారు16 వేల మంది గాయపడ్డారని తెలిపింది.  గాజాలో శనివారం రాత్రి జరిగిన దాడుల్లో 55 మంది మృతిచెందారని, 30 ఇండ్లు ధ్వంసమయ్యాయని పేర్కొంది.

లెబనాన్​కూ మూల్యం తప్పదు: నెతన్యాహు 

హెజ్బొల్లా వల్ల లెబనాన్ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం హెచ్చరించారు. ఈ యుద్ధంలోకి హెజ్బొల్లా దిగితే లెబనాన్​లో అనూహ్య స్థాయిలో విధ్వంసం తప్పదన్నారు.

హమాస్ వేటకు ‘నిలి’ యూనిట్ హమాస్ మిలిటెంట్లను ఏరివేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం ‘నిలి’ పేరుతో స్పెషల్ యూనిట్ ఏర్పాటు చేసింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ లోకి చొరబడి నరమేధానికి పాల్పడిన ప్రతి టెర్రరిస్ట్ నూ అంతం చేయడమే నిలి లక్ష్యమని ఐడీఎఫ్ ప్రకటించినట్లు జెరూసలెం పోస్ట్ వెల్లడించింది. నిలి అంటే.. హిబ్రూ భాషలో ‘‘ఇజ్రాయెల్ శాశ్వతం.. అది అబద్ధం కాబోదు” అనే వాక్యాలకు సంక్షిప్త పదం.