కొత్త రైల్వే మార్గాలపై ఫోకస్!

కొత్త రైల్వే మార్గాలపై ఫోకస్!
  • కిరండోల్ - కొత్తగూడెం కొత్త లైన్​ సర్వేకు ఆదేశాలు
  • ఇప్పటికే మల్కన్​గిరి-భద్రాచలం లైన్​ నిర్మాణానికి రూ.3,592కోట్లు కేటాయింపు
  • కొత్తగూడెం టు కొవ్వూరు రైల్వే లైన్​కు గ్రీన్​ సిగ్నల్​
  • రీ ఎలైన్​మెంట్​ పై సర్వే తర్వాత డీపీఆర్​కు ఆమోదం

భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం, వెలుగు భద్రాద్రికొత్తగూడెం జిల్లా మీదుగా వెళ్లే కొత్త రైల్వే మార్గాలపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్​ పెట్టింది.  ఇప్పటికే ఎల్​డబ్ల్యూఈ నిధులతో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో రహదారులు నిర్మించిన కేంద్రం తాజాగా రైలు మార్గాల అభివృద్ధి ద్వారా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని కిరండోల్​ నుంచి తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా కేంద్రానికి కొత్త రైలు మార్గానికి ఫైనల్​ లొకేషన్​ సర్వే కోసం ఆదేశాలు జారీ చేసింది.

 ఇప్పటికే ఒడిశాలోని మల్కన్​గిరి నుంచి భద్రాచలం కొత్త రైల్వే లైన్​ నిర్మాణం కోసం రూ.3,592కోట్లను కేటాయించింది. భద్రాచలం మన్యంకు రెండో రైలు మార్గం వల్ల రవాణా వ్యవస్థ మరింత విస్తృతం కానుంది. ఇక దశాబ్దాల పోరాటాల ఫలితంగా కొత్తగూడెం(భద్రాచలం రోడ్ ) టు కొవ్వూరు రైల్వే లైన్​కు మోక్షం కలగనుంది. ఈ రైల్వే లైన్​కు సంబంధించి ఇప్పటికే ప్రైమరీ సర్వే పూర్తైంది. కొన్ని మార్పులతో రీ ఎలైన్​మెంట్
​సర్వే చేస్తున్నారు. 

కిరండోల్–కొత్తగూడెం 158.339 కిలోమీటర్ల లైన్....

కిరండోల్–-కొత్తగూడెం రైల్వే లైన్​అభివృద్ధికి 2014--–15 సంవత్సరంలో కేంద్ర రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. 2018లో ప్రాథమిక సర్వే పూర్తి చేశారు. 2023లో ఫైనల్​ లొకేషన్​ సర్వే పూర్తయ్యింది. తాజాగా లైడార్​ సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. కిరండోల్​ నుంచి కొత్తగూడెం వరకు 158.339 కిలోమీటర్ల మేర లైడార్​ సర్వే చేసి తుది నివేదిక ఇవ్వాలని సూచించింది. చత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కిరండోల్​ నుంచి తమోడీ, నీలంపల్లి, చింతలనార్​, మినప, పోటక్​పల్లి, బట్టిగూడ, గొల్లపల్లి, గాంగ్రేల్​, తెలంగాణలోని భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం అడవిరామారం, రామచంద్రునిపేట, భద్రాచలం నుంచి గోదావరి మీదుగా పాండురంగాపురం, కొత్తగూడెం  వరకు లైన్​ నిర్మాణం చేపట్టనున్నారు. తెలంగాణలో 22 కిలోమీటర్ల లైన్, గోదావరిపై వంతెన నిర్మాణం చేపట్టాలి. కొత్తగూడెం-పాండురంగాపురం మధ్య ఇప్పటికే రైల్వే లైన్​ ఉంది. భద్రాచలం - పాండురంగాపురం మధ్య 9.50 కిలోమీటర్లు, రామచంద్రునిపేట, అడవిరామారం వరకు 12.32 కిలోమీటర్లు నిర్మాణం చేయాల్సి ఉంటుంది. 

మల్కన్​గిరి-భద్రాచలం లైన్​కు అనుబంధం..  

ఇప్పటికే ఒడిశాలోని మల్కన్​గిరి నుంచి భద్రాచలానికి కొత్త రైల్వే లైన్​కు కేంద్ర ప్రభుత్వం రూ.3,592కోట్లను కేటాయించింది. దీనిలో భాగంగా భద్రాచలం వద్ద గోదావరిపై వంతెనను కూడా నిర్మించనున్నారు. 12 రైల్వే స్టేషన్లు, పెద్ద, చిన్న వంతెనలు 213 కడతారు. ఈ లైన్​లో గోదావరిపై వంతెన నిర్మిస్తున్నందున దీనికి లింక్​ కిరండోల్​–కొత్తగూడెం రైల్వే లైన్​ అవుతుంది. నార్త్- సౌత్​, ఈస్ట్-నార్త్ ఇండియాలకు కనెక్టివిటీ ఈ రైలు మార్గాల ద్వారా పెరుగుతుంది. టూరిజం, ఖనిజాల రవాణా అభివృద్ధి విస్తరిస్తుంది. భద్రాచలం రామాలయానికి భక్తులు, టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది. 

జంక్షన్​గా భద్రాచలం రోడ్​ రైల్వే స్టేషన్!​

దశాబ్దాల పోరాటాల ఫలితంగా కొత్తగూడెం(భద్రాచలం రోడ్​) టు కొవ్వూరు రైల్వే లైన్​కు మోక్షం కలుగనుండగా, ఇది పూర్తైతే కొత్తగూడెం రైల్వే స్టేషన్​ రూపు రేఖలు మారనున్నాయి. ఈ రైల్వే స్టేషన్​ జంక్షన్​గా మారే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాతో పాటు వైజాగ్​కు, ఈశాన్య రాష్ట్రాలకు రైళ్ల రాకపోకలు పెరగనున్నాయి. ఇప్పటికే సత్తుపల్లి వరకు ఈ రైల్వే లైన్​ పూర్తి అయింది. సింగరేణి కాలరీస్​ కంపెనీ సహకారంతో గతేడాది ఈ పనులు చేపట్టారు. ఇంకా సత్తుపల్లి నుంచి అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి మీదుగా కొవ్వూరు వరకు 118.9కిలో మీటర్ల మేర ఈ లైన్​ నిర్మించాల్సి ఉంది. 

ఇందుకు గానూ దాదాపు రూ. 1,695.71 కోట్లు ఖర్చు అవుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది. ఏపీలోని ఏలూరు లోకసభ పరిధిలోని చింతలపూడి, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల ప్రజల కల నెరవేరనుంది. ఈ రైల్వే లైన్​ పూర్తి అయితే వైజాగ్​ టు  హైదరాబాద్​కు దాదాపు 150కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది.