ఆర్టీపీసీఆర్ చేస్తున్నామని చెప్పాలె..రాష్ట్రానికి రానున్న కేంద్ర హెల్త్ టీం

ఆర్టీపీసీఆర్ చేస్తున్నామని చెప్పాలె..రాష్ట్రానికి రానున్న కేంద్ర హెల్త్ టీం

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో కరోనా టెస్టుల తీరును పరిశీలించేందుకు కేంద్ర హెల్త్ టీమ్ సోమవారం హైదరాబాద్‌కు వస్తోంది. ర్యాండమ్‌గా కొన్ని టెస్టింగ్ సెంటర్లకు వెళ్లి అక్కడి పరిస్థితులను, టెస్టులు జరుగుతున్న తీరు, పాజిటివ్ రేట్‌ తదితర అంశాలను పరిశీలించనుంది. దీంతో టెస్టుల్లో జరుగుతున్నలోపాలు, కేసుల దాపరికాలను కప్పిపుచ్చేందుకు హెల్త్ ఆఫీసర్లు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుసమాచారం. సెంట్రల్ టీమ్ ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చు, వాటికి ఏమని సమాధానం ఇవ్వాలనే దానిపై డాక్టర్లు, స్టాఫ్కు సూచనలు చేసినట్టు తెలిసింది. తెలంగాణలో ఐసీఎంఆర్ రూల్స్‌ పాటించడం లేదన్న ఆరోపణలు ఉండటంతో సెంట్రల్‌ టీమ్ టెస్టులపైనే ఎక్కువగా ఫోకస్ చేయనుంది.

80 శాతం యాంటీజెన్ టెస్టులే..

ప్రస్తుతం రాష్ట్రంలో రోజూ 23 వేల దాకా టెస్టులు చేస్తున్నరు. అయితే ఇందులో 80 శాతం యాంటీ జెన్‌ టెస్టులే ఉంటున్నాయి. ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారం.. కరోనా లక్షణాలు ఉన్నవారికి యాంటీ జెన్‌ టెస్టులో నెగిటివ్ వస్తే..తప్పనిసరిగా ఆర్పీటీసీఆర్ టెస్టుచేయించాలి. రాష్ట్రంలో లక్షణాలున్న చాలా మందికి యాంటీజెన్ టెస్టులో నెగిటివ్ వచ్చినా.. ఆర్పీసీటీ ఆర్ చేయడం లేదు. మరోవైపు అడ్డగోలుగా కేసులు దాచిపెడుతున్నరన్నఆరోపణలు ఉన్నాయి. దీంతో సెంట్రల్‌ టీమ్ అడిగే ప్రశ్నలకు జవాబు ఎలాచెప్పాలో, ఏం చెప్పాలనే దానిపై అధికారులు జూమ్ మీటింగ్ పెట్టి డాక్టర్లు, స్టాఫ్ కు సూచనలు చేసినట్టు తెలిసింది. లక్షణాలు ఉండి యాంటీ జెన్ టెస్టులో నెగిటివ్ వచ్చిన వాళ్లకు ఆర్పీటీ సీఆర్ చేస్తున్నామని చెప్పాలంటూ సూచనలు వచ్చాయని ఓ పీహెచ్‌సీ డాక్టర్ చెప్పారు. ఆర్పీటీ సీఆర్ కిట్లను కూడా పంపారని తెలిపారు. ఇక సెంట్రల్‌ టీమ్ వస్తున్నందున అన్ని టెస్టింగ్ సెంటర్ల వద్ద సోషల్ డిస్టెన్స్‌ రూల్స్‌, ఇన్ఫెక్షన్ కంట్రోల్ రూల్స్‌ పాటించాలని.. టెస్టుల కోసం వచ్చినోళ్లను వెనక్కి పంపొద్దని సూచించినట్టు సమాచారం. పాజిటివ్ రేట్‌ తదితర విషయాల్లోనూ ఆచితూచి సమాధానం చెప్పాలని, ఇందుకోసం ముందే సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్టు డాక్టర్లుచెప్తున్నారు.