వీ6 స్పెషల్ ఇంటర్వ్యూ: వరదలొచ్చినప్పుడు కేసీఆర్, ఒవైసీ ఎక్కడున్నారు?

వీ6 స్పెషల్ ఇంటర్వ్యూ: వరదలొచ్చినప్పుడు కేసీఆర్, ఒవైసీ ఎక్కడున్నారు?

వారాసిగూడ: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగింపునకు చేరుకుంది. ప్రచారం చివరి రోజున బీజేపీ తరఫున కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రచారంలోకి దిగారు. ఇందులో భాగంగా తొలుత చార్మినార్‌‌లోని ప్రముఖ ఆలయం భాగ్యలక్ష్మి అమ్మవారిని షా దర్శించుకున్నారు. ఆ తర్వాత వారాసిగూడలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాదిగా బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీ6 వెలుగుకు అమిత్ షా స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ సర్కార్‌‌పై ఆయన నిప్పులు చెరిగారు.

‘మొత్తం హైదరాబాద్ బీజేపీకి మద్దతుగా ఉంది. ప్రజలందరూ బీజేపీకి సపోర్ట్ చేస్తుండటం చూస్తుంటే ఈసారి మేయర్ పీఠం బీజేపీదేనని స్పష్టంగా తెలుస్తోంది. మేం గెలిచిన చోట్లలో ఎక్కడా మత కలహాలు జరగలేదు. ఇది మా రికార్డు. వరదల వల్ల నష్టపోయిన హైదరాబాద్‌‌ను కేంద్రం ఆదుకుంది. మేం అందరికంటే ఎక్కువగా డబ్బులను ఇచ్చాం. కానీ నేనో విషయం చెప్పాలనుకుంటున్నా.. 7 లక్షల మంది ప్రజల ఇళ్లలో నీరు చేరింది. ఆ సమయంలో సీఎం కేసీఆర్, ఒవైసీ ఎక్కడున్నారు? వాళ్లకు ఇది కనిపించలేదా? ప్రజల ఇళ్లలో నీళ్లు వచ్చినప్పుడు బీజేపీ కార్యకర్తలు, నేతలు వాళ్లకు సాయం అందించారు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే వర్షపు నీళ్లతో మునగని హైదరాబాద్‌‌ను మేం నిర్మిస్తామని ప్రజలు హామీ ఇస్తున్నాం. అలాగే హైదరాబాద్‌ను విశ్వ నగరంలా నిలిచేలా మోడల్ సిటీని చేస్తాం. మోడీజీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. హైదరాబాద్ ప్రజలు బీజేపీకి అవకాశమిస్తే నగరాన్ని నిజాం కల్చర్ నుంచి విముక్తి చేస్తాం. ఏ ఎన్నికలు కూడా గల్లీ ఎలక్షన్స్ కావు. ఇది పక్కా నిజాం కల్చరే. అందుకే కేసీఆర్ అలా మాట్లాడుతున్నారు. ప్రజా ఎన్నికలను గల్లీ ఎలక్షన్స్ అనడం అంటే హైదరాబాద్ జనాలను అవమానించడమే. కేసీఆర్‌‌తో మాకు భయమా? 2019 ఎన్నికల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ సీట్లు పోగొట్టుకున్నారు. ఇప్పుడూ అలాంటి కామెంట్సే చేస్తున్నారు. ఆయనతో మాకు భయమేంటి’ అని అమిత్ షా పేర్కొన్నారు.