కేసీఆర్​ జాతీయ పార్టీపై కిషన్​రెడ్డి ఎద్దేవా

కేసీఆర్​ జాతీయ పార్టీపై కిషన్​రెడ్డి ఎద్దేవా
  • ఆయన పీఎం అయినట్టు.. బిడ్డ కేంద్ర మంత్రి అయినట్టు  ఊహించుకుంటున్నరు
  • కొడుకును సీఎం చేసేందుకే కొత్త డ్రామాలు
  • కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతికి మీటర్లు పెడ్తం 
  • టీఆర్​ఎస్​ గెల్వదని ప్రశాంత్​ కిశోర్​
  • పెట్టే, బేడా సర్దుకొని వెళ్లిపోయారని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: వారసుడ్ని ముఖ్యమంత్రిని చేసి, టీఆర్‌‌‌‌ఎస్​లో ఉన్న అసమ్మతిని తగ్గించుకునేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ పేరిట కొత్త రాగం తీస్తున్నారని, డ్రామాలు ఆడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ పాలనపై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుండడంతో జనం దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టినట్లు, ఆయన పీఎం అయినట్లు.. ఆయన కూతురు కేంద్ర మంత్రి అయినట్టు ప్రగతిభవన్​లో కూసొని పగటి కలలు కంటున్నడు” అని ఎద్దేవా చేశారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్​రెడ్డి మీడియాతో మాట్లాడారు.  కల్వకుంట్ల ఫ్యామిలీకి ఎప్పుడూ ఈడీ, సీబీఐ, ఐటీలే గుర్తుకు వస్తాయని అన్నారు. విమానం రెంట్​కు తీసుకుంటామని చెప్పిన టీఆర్ఎస్... ఇప్పుడు ఏకంగా విమానమే కొంటున్నదని, ఆ పార్టీ అవినీతికి ఇదే నిదర్శనమని ఆరోపించారు.  ‘‘కేసీఆర్ జాతీయ పార్టీ ఎందుకు పెడుతున్నడని ప్రగతి భవన్ ముందే టీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నరు. ఎంఐఎంను బలపర్చేందుకే  జాతీయ పార్టీ పెడుతున్నడని అనుకుంటున్నరు”  అని అన్నారు. మోడీపై కోపంతోనో, వ్యతిరేక భావనతోనో పెట్టే ఏ పార్టీని కూడా జనం ఆదరించరని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో జాతీయ పార్టీపై తప్ప అవినీతి, కుటుంబ పాలనపై చర్చ జరగకూడదనే కల్వకుంట్ల ఫ్యామిలీ కొత్త నాటకం ఆడుతున్నదని కిషన్​రెడ్డి విమర్శించారు. ‘‘రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రా..  ఆ తర్వాత జాతీయ పార్టీ గురించి ఆలోచించు” అని కేసీఆర్​కు సవాల్​ విసిరారు. 

ప్రాంతీయ పార్టీగా ఉంటే రాజ్యాంగం మార్చలేడనే కావొచ్చు

ఎంఐఎం, వైసీపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఏఐఏడీఎంకే కూడా జాతీయ పార్టీలేనని, దేశంలో జాతీయ పార్టీలు రావడం, పోవడం సాధారణమేనని కిషన్​రెడ్డి అన్నారు. ఒక్క ఎంపీ సీటు కూడా లేని జాతీయ పార్టీలు దేశంలో ఎన్నో ఉన్నాయని తెలిపారు. ‘‘భూమి బద్దలు చేస్తాం.. ప్రళయం సృష్టిస్తాం అని గతంలో అన్నవాళ్లు...ఇప్పుడు జాతీయ పార్టీ పెట్టడమే ఆ ప్రకటన సారాంశమనేది అర్థమవుతున్నది. తెలంగాణలో ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుంది. ప్రశాంత్ కిషోర్ కూడా టీఆర్ఎస్ పార్టీ ఎలాగూ గెలవదని పెట్టే బేడే సర్దుకుని వెళ్లిపోయారు” అని కిషన్​రెడ్డి దుయ్యబట్టారు.  ‘‘ప్రాంతీయ పార్టీగా ఉంటే రాజ్యాంగం మార్చలేననే ఉద్దేశంతోనే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతుండొచ్చు” అని ఆయన  అన్నారు. ‘‘రాష్ట్రంలో బీజేపీ నేతల ఫోన్లనే కాదు.. టీఆర్ఎస్  ముఖ్య నేతల ఫోన్లను కూడా కేసీఆర్ ట్యాప్ చేపిస్తున్నరు. రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ముఖ్య అధికారుల ఫోన్లను  కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేపిస్తున్నది” అని ఆరోపించారు. 

టీఆర్​ఎస్​ ఓటమి ఖాయం

బీజేపీపై విష ప్రచారం చేయడమే కల్వకుంట్ల కుటుంబం పనిగా పెట్టుకుందని, రోజూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నదని కిషన్​రెడ్డి మండిపడ్డారు. ‘‘మోటార్లకు మీటర్లు అని గతంలో కూడా అనేక సార్లు కేసీఆర్ ప్రచారం చేశారు.. కానీ, ప్రజలు నమ్మలేదు. మా ప్రభుత్వం మీటర్లు పెడుతామని ఎప్పుడూ చెప్పలేదు.. కానీ, కల్వకుంట్ల కుటుంబం అవినీతికి మాత్రం మీటర్లు ఖచ్చితంగా పెడతం” అని హెచ్చరించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న అవినీతిని కచ్చితంగా లెక్కగడుతామన్నారు.  ‘‘కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రంలో తొండి ఆట ఆడుతున్నది. ఎప్పటికైనా ఈ తొండి ఆటలో టీఆర్​ఎస్​ ఓడిపోవడం ఖాయం. ధర్మం గెలవడం తథ్యం. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన రావడాన్ని ఎవరూ ఆపలేరు” అని అన్నారు.