
హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో స్వామి పరిపూర్ణానందతో సమావేశమయ్యారు. సుమారు గంట పాటు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు బీజేపీలో చేరిన పరిపూర్ణానంద పార్టీ కార్యక్రమాల్లో, ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. కానీ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ రాష్ట్ర నేతలు తనను పట్టించుకోవడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఇటీవల ఢిల్లీ వెళ్లిన పరిపూర్ణానంద.. ఈ విషయంగా పార్టీ జాతీయ నేతలకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దల సూచనల మేరకే కిషన్ రెడ్డి పరిపూర్ణానందను కలిసి, బుజ్జగించేందుకు వెళ్లినట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. అయితే ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, ఇద్దరి మధ్య రాష్ట్ర, జాతీయ రాజకీయ అంశాలపై మాత్రమే చర్చ జరిగిందని కిషన్రెడ్డి, పరిపూర్ణానంద సన్నిహితులు చెప్తున్నారు.