నేడు రాష్ట్రానికి సెంట్రల్ టీమ్

నేడు రాష్ట్రానికి సెంట్రల్ టీమ్

వర్షాలు, వరదల నష్టంపై అంచనా వేయనున్న బృందం 


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాన్ని కేంద్ర అధికారుల బృందం అంచనా వేయనుంది. ఈ టీమ్ సోమవారం రాష్ర్టంలోని పలు జిల్లాల్లో పర్యటించనుంది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ‘‘రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్రం టీమ్ ను ఏర్పాటు చేసింది. ఇందులో అగ్రికల్చర్, ఫైనాన్స్, జలశక్తి, పవర్, ట్రాన్స్ పోర్ట్ శాఖలతో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు ఉన్నారు. 

ఈ టీమ్ కు నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వం వహిస్తున్నారు” అని అందులో పేర్కొన్నారు. ఈ టీమ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, నష్టాన్ని అంచనా వేస్తుందని చెప్పారు. రాష్ట్ర సర్కార్ ఇచ్చే వివరాలను కూడా జత చేసి తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తుందని తెలిపారు.