మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించిన కేంద్ర బృందం

మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించిన కేంద్ర బృందం

మేడిగడ్డ బ్యారేజ్ ను కేంద్ర బృందం పరిశీలించింది. కాళేశ్వరం ప్రాజెక్టు‌‌‌‌‌‌‌‌లో కీలకమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ పిల్లర్లు శనివారం(అక్టోబర్ 21) సాయంత్రం కుంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల కమిటీ.. మంగళవారం(అక్టోబర్ 24) కుంగిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని పరిశీలించేందుకు వచ్చింది.

సుమారు రెండు గంటల పాటు కుంగిన 20వ పిల్లర్ తోపాటు18, 19, 21వ పిల్లర్లను  కేంద్రం బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. పగుళ్లు వచ్చిన డ్యాం, క్రస్ట్ గేట్లను పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు.. బ్యారేజీ డిజైన్, నిర్మాణం వివరాలను రాష్ట్ర ఇరిగేషన్ అధికారుల నుండి వివరాలు రికార్డు చేసుకున్నారు. బ్యారేజీ పటిష్టత,  జరిగిన నష్టంపై  కేంద్ర బృందం అంచనా వేసింది.

 ఆ తర్వాత మీడియాకు ఎలాంటి వివరాలు చెప్పకుండా కేంద్ర బృందం అధికారులు తిరిగి వెళ్లిపోయారు. పూర్తి పరిశీలన అనంతరం సేకరించిన వివరాలను కమిటీ,  కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదించనుంది.

కాళేశ్వరం ప్రాజెక్టు‌‌‌‌‌‌‌‌లో కీలకమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ.. 6వ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15 నుంచి 20 మధ్య ఉన్న పిల్లర్లలో కొన్ని కుంగినట్లు తెలుస్తోంది. దీంతో ప్రాజెక్టు బ్రిడ్జి షేప్‌‌‌‌‌‌‌‌ మారినట్టు కనిపిస్తోంది. మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్న సిబ్బంది.. గేట్ల నుంచి శబ్దాలు రావడంతో అలర్ట్ అయ్యారు. బ్రిడ్జిపై నుంచి వాహనాదారులను అనుమతించకపోవడంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. మేడిగడ్డ బ్రిడ్జి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.