- రూ.25,530 కోట్లతో ఈ వ్యవస్థ ఆధునీకరణ, డీలర్ల కమీషన్ పెంపు
న్యూఢిల్లీ, వెలుగు: దేశంలోని పేద ప్రజల ఆహార భద్రతే లక్ష్యంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ను మరింత బలోపేతం చేస్తూ, ప్రస్తుతం ఉన్న వివిధ పథకాలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ‘సార్థక్– పీడీఎస్’ పథకానికి శ్రీకారం చుట్టింది.16వ ఆర్థిక సంఘం కాల పరిమితి ముగిసే వరకు (2031, మార్చి 31 వరకు) ఈ స్కీమ్ అమలులో ఉంటుంది.
ఇందుకోసం రూ. 25,530 కోట్లను కేటాయించింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఐటీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం సమర్థవంతమైన అమలు కోసం ప్రస్తుతం కొనసాగుతున్న రెండు ప్రధాన పథకాలను (రాష్ట్రాల పరిధిలో ఆహార ధాన్యాల రవాణా, రేషన్ డీలర్ల మార్జిన్ల సహాయ పథకం) ‘స్మార్ట్ పీడీఎస్’ కిందకు తెచ్చినట్టు తెలిపారు. సాంకేతికత ద్వారా పీడీఎస్ వ్యవస్థను సంస్కరించే ‘స్మార్ట్ పీడీఎస్’ను ఇందులో విలీనం చేశామన్నారు. దీనివల్ల డీలర్ల కమీషన్లు పెరిగి, నిరుపేదలకు రేషన్ సరుకులు సక్రమంగా అందేలా నిబంధనలను సవరించామని పేర్కొన్నారు.
