యాత్రల నేపథ్యంలో కరోనా నిబంధనలపై కేంద్రం ఆదేశాలు

యాత్రల నేపథ్యంలో కరోనా నిబంధనలపై కేంద్రం ఆదేశాలు

దేశంలో మళ్ళీ కరోనా కోరలు చాస్తోంది. రోజు రోజుకూ కేసులు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు, కేంద్ర ఆరోగ్య శాఖ పలు సూచనలు జారీ చేసింది. త్వరలోనే అమర్ నాథ్ యాత్ర లాంటి మరికొన్ని ఉత్సవాలు, యాత్రలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. వీటికి తోడు వానాకాలం కూడా రావడంతో ఇతర అంటువ్యాధుల వ్యాప్తికీ ఆస్కారం ఉన్నందున... రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొంది.

  • కొవిడ్ లక్షణాలు లేని వారిని, పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే ఉత్సవాలు, యాత్రల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 
  • యాత్రికులు చేరే ప్రధాన గమ్య స్థానాలు, విశ్రాంతి తీసుకునే ప్రాంతాల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహించేలా రాష్ట్రాలు ఏర్పాట్లు చేయాలని, రోగులను సమీపంలోని దవాఖానాల్లో చేర్పించేందుకు రవాణా సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలని తెలిపింది.
  • భక్తులంతా కరోనా నిబంధనలు తప్పక పాటించేలా అక్కడి ప్రాంతంలోని అధికారులు అప్రమత్తం చేయాలి.
  • యాత్రలు, ఉత్సవాలు లాంటివి జరిగే ప్రదేశాల్లో థర్మల్ స్ర్కీనింగ్ లు, శానిటైజర్స్ ఏర్పాటు చేయాలి. 
  • గుండె, కిడ్నీ, కాలేయం సంబంధిత వ్యాధులు, మధుమేహం, బీపీ లాంటి ధీర్ఘకాలిక వ్యాధులు కలవారు ఈ యాత్రలో ఉన్నపుడు తప్పకుండా మందులు తీసుకునేలా జాగ్రత్త వహించాలి.
  • యాత్రల స్థలాల్లో భక్తులు తరచూ తాకే రెయిల్స్, క్యూ బారికేడ్స్, సీట్లు, బెంచీలు, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలి.
  • ఆసుపత్రుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పడకల సామర్థ్యాన్ని, మెడికల్ సిబ్బందిని, మందులను, ఆక్సిజన్ లాంటి ఇతర సౌకర్యాలను, అంబులెన్స్ వ్యవస్థనూ విస్తృతం చేయడంపై అప్రమత్తం చేయాలి.