- పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం
- జాతీయ గీతం, త్రివర్ణ పతాకంతో సమానంగా చట్టభద్రత
న్యూఢిల్లీ: జాతీయ గేయం ‘వందేమాతరం’ను అవమానించినా, ఆలాపనకు ఆటంకం కలిగించినా ఇకపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందే. అలాంటి చర్యలకు పాల్పడేవారికి మూడేండ్ల వరకు జైలు శిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక సవరణ బిల్లు (ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ హానర్ అమెండ్‌మెంట్ బిల్లు) పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లు చట్టంగా మారితే.. జాతీయ గీతం ‘జనగణమన’, జాతీయ పతాకం, భారత రాజ్యాంగానికి ఉన్నట్టే వందేమాతరానికి కూడా సమాన చట్టబద్ధ రక్షణ లభిస్తుంది.
బిల్లులోని ముఖ్యాంశాలు ఇవే..
1971 నాటి జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టానికి ఈ కొత్త బిల్లు ద్వారా సవరణ చేయనున్నారు. జాతీయ గేయాన్ని అవమానించినా, అడ్డుకున్నా మూడేండ్ల జైలు, జరిమానా లేదా రెండూ విధించే నిబంధనను చేర్చారు. వందేమాతరం గేయం రూపుదిద్దుకుని 150 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంలో కేంద్రం ఈ దిశగా అడుగులు వేసింది. అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతం (జనగణమన) కంటే ముందే వందేమాతరం గేయాన్ని ఆలపించాలని ఇప్పటికే కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలను (సుమారు 3.10 నిమిషాలు) సంపూర్ణంగా పాడాలని స్పష్టం చేసింది.
రాజకీయం వర్సెస్ చరిత్ర
ప్రతిపక్షాల భారీ నినాదాల హోరు మధ్య ప్రభుత్వం వందేమాతరం బిల్లును ప్రవేశపెట్టడంతో ఈ వివాదం మళ్లీ ఉద్రిక్తతలకు దారితీసేలా కనిపిస్తోంది. అయితే, ఈ బిల్లు కేవలం జాతీయ గేయ హోదాను అధికారికం చేయడానికేనని, పాత రాజకీయ వివాదాలను తోడటానికి కాదని బీజేపీ స్పష్టం చేస్తోంది. కాగా, ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నందుకు కాంగ్రెస్‌పై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
‘‘కాంగ్రెస్, దాని అనుబంధ వర్గాలకు వందేమాతరం అంటేనే ద్వేషం’’ అని ఆయన ఒక వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. ముస్లిం లీగ్ నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి జాతీయ గేయాన్ని నెహ్రూ రెండు భాగాలుగా విభజించారు అని ఆరోపించారు. మొదటి రెండు చరణాలు మాత్రమే ఉన్నప్పటికీ, కాంగ్రెస్, దానిలోని అనేక మంది నాయకులు దానిని పాడటానికి నిరాకరించారు అని పేర్కొన్నారు. ఈ అంశంపై గతేడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. అయితే, బీజేపీ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.
1937లో ముస్లిం వర్గాల నుంచి వచ్చిన కొన్ని అభ్యంతరాల నేపథ్యంలో.. కేవలం మొదటి రెండు చరణాలనే అధికారికంగా ఉపయోగించాలని మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్‌లాంటి మహనీయులతో కూడిన కమిటీ సమష్టిగా నిర్ణయించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. బెంగాల్‌కు చెందిన ప్రముఖ నవలా రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయ 1875లో ఈ గేయాన్ని రచించారు. 1882లో ఆయన రాసిన ‘ఆనంద్ మఠ్’ నవలలో ఇది ప్రచురితమైంది.
