కరోనాపై పోరాటానికి యోగా, ధ్యానం పన్జేస్తయా?

కరోనాపై పోరాటానికి యోగా, ధ్యానం పన్జేస్తయా?
  • పరిశోధనలకు ప్రపోజల్స్ పంపండి
  • అన్ని రాష్ట్రాలను కోరిన సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ

న్యూ ఢిల్లీ: యోగా, ధ్యానంతో మానసిక ఒత్తిడి తగ్గుతుందని, శ్వాసకోశ సమస్యలు నయమవుతాయని డాక్టర్లు, యోగా గురువులు చెప్తుంటారు. అయితే, ఒత్తిడి తగ్గడం నిజమే కానీ, తద్వారా ఇమ్యునిటీ పవర్ పెరిగి కరోనాను ఎదుర్కొనేందుకు యోగా, మెడిటేషన్ ఏమయినా ఉపయోగపడతాయా? అనే కోణంలో యోగా, మెడిటేషన్ అవసరాన్ని అధ్యయనం చేసేందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించింది. కరోనాపై ఫైట్​కు యోగా, ధ్యానం ఎట్లా ఉపయోగపడతాయో తెలుపుతూ.. ఆ రంగంలో ట్రాక్ రికార్డు ఉన్న సైంటిస్టులు, డాక్టర్లు, ఇతరులు కాన్సెప్ట్ నోట్స్ సమర్పించాలని సూచించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ యోగ అండ్ మెడిటేషన్ (సత్యం) కార్యక్రమం కింద ఈ ప్రతిపాదనలను కోరుతున్నట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ తెలిపింది. సాధారణ జీవితంలో ఒంటరితనం, ఒత్తిడి, ఫ్రస్ట్రేషన్, ఆందోళన వంటి సమస్యలను ఈ ప్రాజెక్టు ద్వారా పరిష్కరించవచ్చునని భావిస్తున్నట్లు వివరించింది. ఇప్పటివరకు శాస్త్రీయ పద్ధతిలో జరిగిన పరిశోధనలు, ప్రస్తుత కాన్సెప్ట్, లక్ష్యాలు, అవలంబించాల్సిన పద్ధతి, ఫలితాలేవిధంగా వస్తాయి, బడ్జెట్ ఎంత అవసరం, సంస్థ వివరాలతో కూడిన ప్రపోజల్స్ పంపాలని శాఖ వెబ్ సైట్ లో సూచించింది.