నీట్‌‌పై చర్చకు 100 శాతం సిద్ధం..ఆందోళనలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌ కామెంట్

నీట్‌‌పై చర్చకు 100 శాతం సిద్ధం..ఆందోళనలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌ కామెంట్
  • స్టూడెంట్లకు జవాబు చెప్పాల్సిన బాధ్యత తమకు ఉందన్న మంత్రి
  • రాజకీయ ప్రచారాల కోసం విద్యార్థులను పావులుగా వాడుకోవద్దని విజ్ఞప్తి

న్యూఢిల్లీ: నీట్ యూజీ వివాదంపై కేంద్ర ప్రభుత్వం అత్యంత స్పష్టమైన వైఖరితో ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్ వేదికగా చర్చించేందుకు ప్రభుత్వం 100 శాతం సిద్ధంగా ఉందని తెలిపారు. దేశంలోని కోట్లాది మంది విద్యార్థులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. నీట్‌‌ విషయంపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ప్రతిపక్షాల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. నీట్ పేపర్ లీకేజీ నిరసనల పేరుతో విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ రాజకీయ సాధనంగా మలుచుకుంటోందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను వాడుకోవద్దని ప్రతిపక్షాలను ధర్మేంద్ర ప్రధాన్‌‌ కోరారు. ‘‘మా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తిగా కట్టుబడి ఉంది. నీట్ అంశంపై పార్లమెంట్ వేదికగా సమగ్ర చర్చ జరిపి, యువత వ్యక్తపరుస్తున్న ప్రతి న్యాయమైన ఆందోళనకు సమాధానమిస్తం.

రాజకీయ ప్రచారాల కోసం విద్యార్థులను పావులుగా వాడుకోవడం ఏమాత్రం తగదు. నేటి విద్యార్థులకు కావాల్సింది రాజకీయ గందరగోళం కాదు.. స్పష్టత, నినాదాలు కాదు.. పరిష్కారాలు, సభను స్తంభింపజేయడం కాదు.. బాధ్యతారాహిత్యాన్ని సరిదిద్దే చర్యలు” అని పేర్కొన్నారు. విద్యార్థులకు పారదర్శకత, సంస్కరణలు, జవాబుదారీతనం అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.