లేటరల్ ఎంట్రీపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్

లేటరల్ ఎంట్రీపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్
  •     ప్రతిపక్షాల పోరాటంతోవెనక్కి తగ్గిన కేంద్రం 
  •     రిక్రూట్ మెంట్ అడ్వర్టయిజ్ మెంట్​ను రద్దు చేయాలని యూపీఎస్సీకి లేఖ

న్యూఢిల్లీ :  లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ నోటిఫికేషన్​ను రద్దు చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ని కోరింది. వివిధ ప్రభుత్వ శాఖల్లోని 45 జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్ పోస్టులను లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేసేందుకు ఈ నెల 17న యూపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను కేంద్రం గుంజుకుంటున్నదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో లేటరల్ ఎంట్రీపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఇందుకోసం ఇచ్చిన అడ్వర్టయిజ్​మెంట్లను రద్దు చేయాలంటూ యూపీఎస్సీ చైర్ పర్సన్ ప్రీతి సుదాన్​కు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం లేఖ రాశారు. ‘‘సామాజిక న్యాయమే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పనే సామాజిక న్యాయానికి మూలస్తంభం. ప్రస్తుతం మీరు భర్తీ చేస్తున్న స్పెషల్ పోస్టుల్లో రిజర్వేషన్ల నిబంధన లేదు. మోదీ ప్రభుత్వం సామాజిక న్యాయంపై దృష్టిసారించిన నేపథ్యంలో ఈ అంశంపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. లేటరల్ ఎంట్రీ ద్వారా పోస్టుల భర్తీకి ఈ నెల 17న మీరిచ్చిన అడ్వర్టయిజ్ మెంట్ ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని లేఖలో మంత్రి జితేంద్ర సింగ్​ పేర్కొన్నారు.

రిజర్వేషన్ల కోసం ఎందాకైనా పోరాడ్తం: రాహుల్ 

రిజర్వేషన్లను కాపాడతామని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పారు. లేటరల్ ఎంట్రీపై కేంద్రం యూటర్న్ తీసుకున్న తర్వాత ఆయన స్పందించారు. ‘‘రాజ్యాంగాన్ని రక్షించేందుకు, రిజర్వేషన్లను కాపాడేందుకు ఎందాకైనా పోరాడతాం. లేటరల్ ఎంట్రీ లాంటి బీజేపీ కుట్రలను అడ్డుకుంటం” అని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో రాహుల్ పోస్టు పెట్టారు. కాగా,  అణగారిన వర్గాల రిజర్వేషన్లను లాక్కోవాలని బీజేపీ చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నామని 
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు.