యూరియాపై కేంద్రం క్లారిటీ : లక్ష టన్నులు అడిగితే..రెట్టింపు ఇచ్చినం

యూరియాపై కేంద్రం క్లారిటీ : లక్ష టన్నులు అడిగితే..రెట్టింపు ఇచ్చినం

లక్ష టన్నుల ఎరువులు అడిగితే..రెండు లక్షలు ఇచ్చినం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికంటే కేంద్రం నుంచి ఎక్కువ ఎరువులను కేటాయించామని.. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే యూరియా కోసం ఇబ్బందులు తలెత్తాయని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడ చెప్పారు. సెప్టెంబర్​ నెలకు సంబంధించి లక్ష టన్నుల ఎరువులు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరిందని, వీలైతే అదనంగా ఇవ్వాలని అడగడంతో.. తాము రెండు లక్షల టన్నులు కేటాయించామని తెలిపారు. బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌‌ ఢిల్లీలో సదానందగౌడను కలిసి.. యూరియా సరఫరా అంశంలో కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్​చేస్తున్న ఆరోపణలను వివరించారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి కేటాయించిన యూరియా లెక్కలు, వివరాలను సదానంద విడుదల చేశారు.

అవసరానికి మించే ఎరువులున్నయ్..

ఈ ఏడాది ఖరీఫ్​ సీజన్​కు సంబంధించి సెప్టెంబర్​ తొలివారం వరకు రాష్ట్రానికి 7.1 లక్షల టన్నులు ఎరువులు అవసరమని.. కేంద్రం నుంచి 7.45 లక్షల టన్నులు సరఫరా చేశామని సదానందగౌడ వివరించారు. ఏ నెలకు అవసరమైన మేర ఆ నెలలో సరఫరా చేశామని, స్టోరేజీ సరిపోలేదంటూ రాష్ట్ర ప్రభుత్వమే యూరియాను తీసుకోలేదని స్పష్టం చేశారు. తాజాగా లక్ష టన్నులు అదనంగా కేటాయించామని తెలిపారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇలా అదనంగా ఇస్తామని, తెలంగాణలో రైతులందరికీ ఎరువులు అందడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఈ నెల మొదట్లో పది రైల్వే ర్యాక్​ల ఎరువులు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరితే.. 18 ర్యాక్​లు కేటాయించామని కేంద్ర మంత్రి తెలిపారు. ఇప్పటికే 5 ర్యాక్​ల ఎరువులు వచ్చాయని, మరో ఐదు రవాణాలో ఉన్నాయని.. మిగతావి కొద్దిరోజుల్లో వస్తాయని వివరించారు. కేంద్ర ఎరువుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.