Lingampally Flyover: లింగంపల్లిలో తప్పిన ట్రాఫిక్ తిప్పలు.. అందుబాటులోకి BHEL జంక్షన్ ఫ్లైఓవర్

Lingampally Flyover: లింగంపల్లిలో తప్పిన ట్రాఫిక్ తిప్పలు.. అందుబాటులోకి BHEL జంక్షన్ ఫ్లైఓవర్

సంగారెడ్డి జిల్లా: బీహెచ్ఈఎల్ చౌరస్తా ఫ్లైఓవర్ను కేంద్ర రోడ్డు భవనాల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఫ్లై ఓవర్ను ప్రారంభించిన ఆయన జాతికి అంకితం చేశారు. ఫ్లై ఓవర్ పొడవునా ‘‘ఫ్లై ఓవర్ ఆఫ్ ది మెన్ నితిన్ గడ్కరీ’’ అంటూ ఫ్లెక్సీలు కనిపించాయి. 172 కోట్ల రూపాయల వ్యయంతో 6 లేన్లుగా 1.6 కిలో మీటర్ల మేర ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగింది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, దామోదర్ రాజనర్సింహ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, స్థానిక ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ పాల్గొన్నారు. గతంలో లింగంపల్లి జంక్షన్ దాటాలంటే అరగంటకి పైగా సమయం పట్టేది. ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు ఆ తిప్పలు తప్పనున్నాయి. 

లింగంపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కావడంతో సంగారెడ్డి జిల్లా ప్రజల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడినట్లయింది. ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో బీహెచ్ఈఎల్ జంక్షన్ వద్ద నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. 2022లో ఫ్లై ఓవర్ పనులు ప్రారంభించగా, 2024 అక్టోబర్ లోగా పనులు పూర్తి చేయాల్సి ఉండగా పనుల్లో జాప్యం కారణంగా ఇప్పటికి ప్రారంభమైంది.

►ALSO READ | నిరుద్యోగులకు ATC సెంటర్ ద్వారా తక్కువ కాలంలోనే జాబ్స్: ఎంపీ వంశీ

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, జోగిపేట, నారాయణఖేడ్ వాసులు పటాన్ చెరు నుంచి బీరంగూడ మీదుగా లింగంపల్లి ఫ్లై ఓవర్ ఎక్కి ట్రాఫిక్ సమస్య లేకుండా హైదరాబాద్ చేరుకోగలుగుతారు. అంతకుముందు పటాన్ చెరు, పాశమైలారం, అమీన్​పూర్, బీరంగూడ వాసులు సంగారెడ్డి, జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాకు వెళ్లే వాహనాలు అశోక్ నగర్, బీహెచ్ఈఎల్ సర్కిల్ మీదుగా ప్రయాణించడంతో ఈ రహదారి నిత్యం బిజీగా ఉండేది. ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ కావడం, ఒక్కోసారి కిలోమీటర్ ప్రయాణం కూడా గంటల తరబడి సాగుతుండేది. ఇలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం లింగంపల్లి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టింది.