యుద్ధం పరిష్కారం కాదు.. భారత్-పాక్ ఉద్రిక్తతలపై ఐరాస కీలక ప్రకటన

యుద్ధం పరిష్కారం కాదు.. భారత్-పాక్ ఉద్రిక్తతలపై ఐరాస కీలక ప్రకటన

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య పరిస్థితులు పూర్తిగా క్షీణించాయి. ఉగ్రవాదులను పెంచి పోషిస్తోన్న దాయాది దేశానికి తగిన బుద్ధి చెప్పేందు పాక్‎తో దౌత్య, వాణిజ్య సంబంధాలను భారత్ నిర్మోహమాటంగా తెంచేసుకుంది. పాక్ కూడా భారత్‎పై కొన్ని ఆంక్షలు విధించింది. ఈ పరిణామాలతో ఇరుదేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరుదేశాలు సై అంటే సై అంటుండటంతో ఏ క్షణమైనా యుద్ధం మొదలు కావొచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. పాక్, భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఐకర్యాజ్య సమితి సోమవారం (మే 5) కీలక ప్రకటన చేసింది.

పాక్, భారత్ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడం బాధాకరమని.. ఇలాంటి సమయంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నానని సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్‌ పేర్కొ్న్నారు. పహల్గామ్ దాడి తర్వాత భావోద్వేగాలను అర్థం చేసుకోగలం.. కానీ ఈ సమయంలో ఇరుదేశాల పొరపాట్లు చేయొద్దు.. సైనిక చర్య పరిష్కారం కాదని హితవు పలికారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు నివారించే ఏ చర్యకైనా సహకరిస్తామని పేర్కొన్నారు. 

కాగా, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాం ఏరియా బైసారన్ మైదాన ప్రాంతంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ఉగ్రమూకలు కురిపించిన తుటాల వర్షానికి 26 మంది పర్యాటకులు బలయ్యారు. ఈ ఉగ్రదాడి వెనక పాక్ హస్తం ఉన్నట్లు గుర్తించిన భారత్.. దాయాది దేశంపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలోనే పాక్‎తో పూర్తిగా దౌత్య సంబంధాలు తెంచుకుని.. పలు ఆంక్షలు విధించింది. సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుని పాక్‎ను దెబ్బకొట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో ఐరాస పై విధంగా స్పందించింది.