
- పాత రేషన్‌కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పు మొదలుపెట్టిన అధికారులు
- ఇప్పటికే 20 శాతం పూర్తయ్యిందన్న అధికారులు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్‌పరిధిలోని పాత రేషన్‌కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియను పౌరసరఫరాలశాఖ అధికారులు ప్రారంభించారు. సుమారు ఎనిమిదేండ్లుగా రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులను ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. కానీ, లిస్టులో పేర్లు తొలగించే ప్రక్రియను మాత్రం కొనసాగిస్తున్నారు. సాధారణంగా రేషన్‌కార్డులో కుటుంబంలోకి వచ్చిన కొత్త సభ్యుల పేర్లను చేర్చేందుకు ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటోంది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకూ దాదాపు 3లక్షల కుటుంబాలు.. ఆరు లక్షల వరకూ కొత్త సభ్యులను చేర్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని ప్రకటించడం, దరఖాస్తులు తీసుకోవడంతో దాదాపు ఎనిమిదేండ్ల తర్వాత ఇటీవలే మళ్లీ కొత్త సభ్యుల చేర్పు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఇప్పటికే 20 శాతం పూర్తయినట్టు చెబుతున్నారు.
ముందుగా మీసేవ ద్వారా వస్తున్న దరఖాస్తులను పరిశీలిస్తున్నామన్నారు. అయితే, కొత్త రేషన్‌కార్డుల కోసం ఇప్పటికే మీసేవ ద్వారా 3.50 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, జారీ మాత్రం ప్రారంభించ లేదు. వీటి పరిశీలన, ఇంటింటి తనీఖీ తర్వాతే కార్డుల జారీ ప్రక్రియ కొనసగుతుందని అధికారులు వెల్లడించారు.