
- సిబిల్ స్కోర్ ఉంటేనే యువ వికాసం
- డిఫాల్టర్ల దరఖాస్తులు రిజెక్ట్ చేసే చాన్స్!
- 70 శాతం అప్లికేషన్ల వెరిఫికేషన్ పూర్తి
- సిబిల్ స్కోర్ చెక్ చేసేందుకు ఫీజు కట్టాలంటున్న బ్యాంకులు
- ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వం ప్రపోజల్
హైదరాబాద్, వెలుగు: రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు సిబిల్ స్కోర్ కీలకంగా మారనున్నది. అప్లికెంట్ సిబిల్ స్కోర్ తక్కువున్నా.. లోన్ రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా.. గతంలో అగ్రికల్చర్, హౌసింగ్, వెహికల్, పర్సనల్ లోన్ తీసుకుని కట్టకపోయి డిఫాల్టర్ గా మిగిలినా.. అలాంటి వారి అప్లికేషన్లను పరిగణనలోకి తీసుకోరని తెలుస్తున్నది. లోన్, ఇంట్రస్ట్ కట్టని డిఫాల్టర్లు, సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నవాళ్లను మినహాయిస్తే.. సుమారు 60శాతం మంది అర్హులు అవుతారని అధికారులు చెప్తున్నారు.
రాజీవ్ యువ వికాసం స్కీమ్ కోసం వచ్చిన ప్రతి అప్లికేషన్‌కు సిబిల్ స్కోర్ ను బ్యాంకు అధికారులు చెక్ చేయాల్సి ఉంటుంది. అందుకు అమౌంట్ కలెక్ట్ చేయాలని పలు బ్యాంకులు నిర్ణయించాయి. ఒక్కో అప్లికేషన్‌కు రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేయనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి బ్యాంకు అధికారులు సమాచారం ఇచ్చారు. యువ వికాసం స్కీమ్‌కు మొత్తం 16 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఒక్కో అప్లికేషన్‌కు రూ.100 తీసుకున్నా.. సుమారు రూ.16 కోట్ల వరకు బ్యాంకులకు రెవెన్యూ వస్తుంది. అయితే, బ్యాంకులు పెట్టిన ఫీజు వసూలు ప్రతిపాదనను ఎస్సీ వెల్ఫేర్ అధికారులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లనున్నారు. స్టేల్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) మీటింగ్‌లో.. సిబిల్ స్కోర్ చూసేందుకు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని బ్యాంకులను ప్రభుత్వం కోరనున్నదని అధికారులు చెప్తున్నారు.
16లక్షలకు పైగా అప్లికేషన్లు
రాష్ట్ర వ్యాప్తంగా యువ వికాసం స్కీమ్ కు మొత్తం 16,25,441 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో అత్యధికంగా బీసీల నుంచి 5,35,666 అప్లికేషన్లు, ఎస్సీల నుంచి 2,95,908, ఎస్టీల నుంచి 1,39,112, ఈబీసీల నుంచి 23,269, మైనారిటీల నుంచి 1,07,681, క్రిస్టియన్ మైనారిటీ నుంచి 2,689 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి దాకా మండల ఆఫీసర్లు 70 శాతం అప్లికేషన్లను పరిశీలించారని ఎస్సీ వెల్ఫేర్ అధికారులు చెప్తున్నారు. వెరిఫికేషన్ పూర్తయ్యాక వాటిని బ్యాంకు అధికారులు పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు. అర్హుల జాబితాను ఈ నెల ఆఖరు నాటికి మండల అధికారులు కలెక్టర్‌కు పంపిస్తారు. అనంతరం తుది జాబితాను రిలీజ్ చేసి ప్రభుత్వానికి పంపిస్తారు. వచ్చే నెల 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు లోన్ మంజూరు చేయనున్నారు. ఈ ఏడాది సుమారు 5 లక్షల మందికి స్కీమ్ ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.