- ఐలోని మల్లన్న జాతరపై సర్కార్ ఫోకస్
- దాదాపు 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
- మేడారం నేపథ్యంలో రష్ మరింత పెరిగే అవకాశం
- ఏర్పాట్లు మొదలుపెట్టిన అధికార యంత్రాంగం
హనుమకొండ/ వర్ధన్నపేట, : హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జునస్వామి క్షేత్రంలో జరిగే ఈ జానపదుల జాతర మరో 20 రోజుల్లో ప్రారంభం కానుండగా, మేడారం నేపథ్యంలో ఈసారి రష్ ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటి నుంచే భక్తుల తాకిడి పెరుగుతుండటంతో ప్రభుత్వం ఐలోని మల్లన్న జాతరపై ఫోకస్ పెట్టింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయశాఖ తగిన చర్యలు చేపడుతున్నది.
13 నుంచి జాతర.. 3 లక్షలకుపైగా భక్తులు
ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జనవరి 13 నుంచి షురూ కానున్నాయి. భోగి ముందు రోజు జాతర ప్రారంభం కానుండగా, మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత ఉగాది వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జనవరి 15న మకర సంక్రాంతి సందర్భంగా బండ్లు తిరిగే కార్యక్రమం, 16న స్వామివారి దర్శనాలు, ఫిబ్రవరి 1న ఎల్లమ్మదేవి పండుగ, 15న శివరాత్రి సందర్భంగా శివకల్యాణం, లింగోద్భవం, పెద్దపట్నం పండుగ నిర్వహిస్తారు. మార్చి 15న ఒగ్గు పూజారులతో పెద్దపట్నం వేయించి, మల్లికార్జునస్వామి కల్యాణం, 19న ఉగాది పండుగతో ఉత్సవాలు ముగియనున్నాయి.
సంక్రాంతి నుంచి ఉగాది వరకు దాదాపు మూడు నెలలపాటు జరిగే జాతరగా ఐలోని మల్లన్న క్షేత్రానికి పేరుంది. ఇదిలాఉంటే భోగి నుంచి మూడు రోజుల పాటు జరిగే మల్లన్న ఉత్సవాలకు 3 లక్షలకుపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి మేడారం జాతర జరగనున్న నేపథ్యంలో ముందస్తుగా మల్లన్నకు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో అదనంగా ఇంకో లక్షమంది వచ్చే ఛాన్స్ ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు.
శానిటేషన్, తాగునీటిపై ఫోకస్..
ఐలోని జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది. ఈ నెల 20న దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హనుమకొండ జిల్లా అధికార యంత్రాంగంతో రివ్యూ చేశారు. జాతరలో శానిటేషన్ ప్రధాన సమస్యగా మారగా, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. జీడబ్ల్యూఎంసీ నుంచి 150 మంది శానిటేషన్ వర్కర్లతో పాటు ఇంకో 161 మందిని చుట్టుపక్కల జీపీల నుంచి తీసుకునేలా కసరత్తు చేస్తున్నారు.
చెత్తను ఎప్పటికప్పుడు తరలించేలా 15 ట్రాక్టర్లు, పారిశుద్ధ్య నిర్వహణకు వందకుపైగా బ్లీచింగ్ పౌడర్ బ్యాగ్స్, 200కుపైగా డిస్ ఇన్ఫెక్టెడ్ లైమ్ బ్యాగ్స్, 400 లీటర్ల వరకు సోడియం హైపోక్లోరైడ్ వినియోగించనున్నారు. 3 ఫాగింగ్ మెషీన్స్, 5 హ్యాండ్ పంప్స్ తో దోమల నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు. తాగునీటి సౌకర్యం కోసం ఆలయ ఆవరణలో 4 వాటర్ ట్యాంకులు ఉండగా, 90 వరకు నల్లాలున్నాయి. వాటికి అదనంగా జీడబ్ల్యూఎంసీ నుంచి 10 వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేస్తున్నారు. క్యూలైన్లలో కూడా తాగునీటి సౌకర్యం ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
క్యూ లైన్లలో బేబీ ఫీడింగ్ సెంటర్లు..
ఈసారి మల్లన్న జాతరలో గర్భిణులు, వృద్ధులు, వికలాంగులకు స్పెషల్ క్యూ లైన్ తోపాటు మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలతో వచ్చేవారి కోసం క్యూ లైన్ల మధ్యలో రెండు చోట్ల బేబీ ఫీడింగ్ సెంటర్లు పెడుతున్నారు. మహిళల స్నానాలు, దుస్తులు మార్చుకునేందుకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా రెండు మొబైల్ టాయిలెట్స్ కూడా పెడుతున్నారు. ప్రజల రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ టెంపరరీ బస్టాండ్ తోపాటు ఏడు చోట్ల పార్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.500 చెల్లించే వీఐపీ దర్శనాల కోసం ప్రత్యేక క్యూలైన్ పెడుతున్నారు.
కొమురెల్లికి స్పెషల్ బస్సులు..
వరంగల్ నుంచి ఐనవోలుకు గతేడాది 40 బస్సులు నడవగా, మహాలక్ష్మీ స్కీం వర్తిస్తున్న నేపథ్యంలో ఈసారి 50 స్పెషల్ బస్సులు తిప్పేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి నుంచి కొమురవెల్లికి వెళ్లేందుకు కూడా ఐదు స్పెషల్ బస్సులు నడపనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
భద్రత పరమైన చర్యల్లో భాగంగా దాదాపు 500 మంది పోలీసులతో ఆలయం బయట, క్యూలైన్లు, గుడి లోపల మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఆలయంలో 65 సీసీ కెమెరాలు ఉండగా, మరో 100 టెంపరరీగా ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆఫీసర్లు చెబుతున్నారు.
భక్తులకు ఇబ్బందులు కలగనివ్వం..
ఐనవోలు మల్లికార్జునస్వామి జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయశాఖ తరఫున ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా మహిళలను దృష్టిలో పెట్టుకుని సౌకర్యాలు కల్పిస్తున్నాం. మేడారం జాతర వల్ల ఈసారి గతం కంటే ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. దర్శనానికి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. - కందుల సుధాకర్, ఈవో, ఐనవోలు
