వికసిత్ భారత్ జాతీయ స్లోగన్..గద్వాల, వనపర్తి జిల్లాల్లో గవర్నర్ పర్యటన

వికసిత్ భారత్ జాతీయ స్లోగన్..గద్వాల, వనపర్తి జిల్లాల్లో  గవర్నర్ పర్యటన

గద్వాల/వనపర్తి, వెలుగు: వికసిత్  భారత్  జాతీయ స్లోగన్ గా గుర్తించి ప్రజలంతా దేశాభివృద్ధికి పాటుపడాలని గవర్నర్  జిష్ణుదేవ్  వర్మ పిలుపునిచ్చారు. సోమవారం అలంపూర్  జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గద్వాల, వనపర్తి కలెక్టరేట్లలో జిల్లా ఆఫీసర్లు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా గవర్నర్​ మాట్లాడుతూ.. అలంపూర్  జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు ఎంతో ప్రాముఖ్యత కలిగినవని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తానని చెప్పారు. రాజ్ భవన్ ను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో లోక్ భవన్ గా పేరు మార్చినట్లు తెలిపారు. 

విద్యారంగంలో గుణాత్మక అభివృద్ధి సాధించి ఉత్తమ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కవులు, కళాకారులు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇండియన్  రెడ్ క్రాస్  సొసైటీ ద్వారా రక్తదాన శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. ఎదరయ్యే ప్రతి సవాల్​కు పరిష్కారాలు కనుక్కొని ప్రజల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. 

క్షయరహిత సమాజాన్ని నిర్మించాలన్నా, బాల్యవివాహాలను నిర్మూలించాలన్నా కవులు, కళాకారులు, రచయితల గళం ఎంతో కీలకమన్నారు. ప్రతి ఒక్కరికీ హెల్త్  ప్రొఫైల్  ఉండాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం హెల్త్ యాప్ ను ఏర్పాటు చేయడం అద్భుతమని వనపర్తి అధికారులను అభినందించారు. జిల్లాలో అమలవుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను గవర్నర్ కు వివరించారు. 

గవర్నర్ కు గద్వాల చేనేత పట్టుచీర ఫ్రేమ్ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందించారు. గద్వాల కలెక్టరేట్  ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాళ్లను గవర్నర్  పరిశీలించారు. గద్వాల చీరల ప్రత్యేకతను చేనేత కార్మికులను అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికులతో కలిసి గవర్నర్  మగ్గం నేశారు. ఎంపీ మల్లురవి, కలెక్టర్లు సంతోష్, ఆదర్శ్​ సురభి, గవర్నర్​ జాయింట్​ సెక్రటరీ భవానీ శంకర్, ఎమ్మెల్యేలు విజయుడు, తూడి మేఘారెడ్డి, ఎస్పీ సునీత పాల్గొన్నారు.