- కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఆఫీసర్లు
కోస్గి, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో బుధవారం పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన క్యాండిడేట్లు ఎక్కువ మంది విజయం సాధించారు. దీంతో వారిని సన్మానించాలని నిర్ణయించారు.
నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, జిల్లా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సర్పంచులను సన్మానించడంతో పాటు వారితో కలిసి సీఎం భోజనం చేయనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం ఆయన కోస్గికి చేరుకొని, కార్యక్రమం అనంతరం హైదరాబాద్ తిరిగి వెళ్తారని అధికారులు తెలిపారు.
కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, మద్దూర్, దౌల్తాబాద్, కొడంగల్, బొంరాస్పేట్, గుండుమాల్, కొత్తపల్లి మండలాలకు చెందిన 180 మంది సర్పంచులు, 180 మంది ఉప సర్పంచులు, 1,739 మంది వార్డు సభ్యులను సీఎం సన్మానించనున్నారు. సీఎం టూర్కు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు నారాయణపేట ఎస్పీ వినీత్ తెలిపారు. మంగళవారం ఆయన కోస్గిలో పర్యటించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
