- ఏర్పాట్లు చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ
హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. సర్పంచ్లకు పల్లెల్లో పాలన, నిధులు, విధులు, డెవలప్మెంట్ తదితర అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తున్నది.
సంక్రాంతి తర్వాత జిల్లాలవారీగా సర్పంచ్లకు ట్రైనింగ్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌లతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ తర్వాత ట్రైనింగ్ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు. జిల్లాల్లో వందలాది మంది సర్పంచ్‌లు ఉంటారు.
ఒకేసారి శిక్షణ ఇవ్వడం ఇబ్బందిగా ఉంటుందని, టీమ్‌లుగా డివైడ్ చేయాలని భావిస్తున్నారు. 50 నుంచి 100 మందిని ఒక్క టీమ్‌గా చేసి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అయితే, ఈ ట్రైనింగ్‌లో గ్రామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు, వాటి వినియోగంతో పాటు పల్లెలను ఎలా అభివృద్ధి చేయాలనేదానిపై వివరించనున్నారు. గ్రామసభల నిర్వహణ, తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు.
3 జిల్లాలను ఒక గ్రూపుగా..
కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో పాటు సంక్రాంతిలోగా 3 జిల్లాలను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి సమ్మేళనాలు నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటు, ఆయా జిల్లాల మంత్రులు ఈ సమ్మేళనాల్లో పాల్గొంటారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు దిశానిర్దేశం చేస్తారు.
సంక్రాంతి తర్వాత ఒకట్రెండు రోజుల్లోనే హైదరాబాద్‌లో నిర్వహించే బహిరంగసభలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన సర్పంచ్‌లను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నట్టు తెలిసింది. ఆ తర్వాత ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రంలో.. ఆ జిల్లా పరిధిలోని సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్‌డీలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమం కొనసాగిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్లుగా బాధ్యతలు స్వీకరించిన వారికి సీఎం రేవంత్ ఎక్స్‌లో శుభాకాంక్షలు చెప్పారు. ‘‘మంచి పాలన అందించి, పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్ది, మీరంతా ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్న’’అని రేవంత్ పేర్కొన్నారు.
