- మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహణ
- మహిళలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రారంభం
బషీర్బాగ్, వెలుగు: మహిళల సమస్యలకు సత్వర న్యాయం అందించేందుకు మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మంగళవారం లక్డికాపూల్లోని హైదరాబాద్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ‘నారీ న్యాయ్’ కార్యక్రమం నిర్వహించారు. కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మహిళల నుంచి నేరుగా అర్జీలు, పెండింగ్ ఫిర్యాదులు స్వీకరించారు.హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కదిరవన్ పాలనీ, షీటీమ్ డీసీపీ లావణ్య తదితరులు పాల్గొన్నారు. బాధిత మహిళల సమస్యలను చైర్ పర్సన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ప్రైవేట్ కాలేజీలో జీతాలు ఇవ్వకపోవడం, కట్నం వేధింపులు, భర్త వదిలేసి వెళ్లిపోవడం, బ్లాక్ మెయిల్ వంటి ఫిర్యాదులు వచ్చాయి. ఈ కేసుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన శారద సంబంధిత చర్యలకు ఆదేశించారు. మహిళలకు అండగా ఉండేందుకే ‘నారీ న్యాయ్’ ప్రారంభించామని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని శారద తెలిపారు. ఫిర్యాదుల్లో మైనార్టీ మహిళలు ఎక్కువగా ఉన్నారని, కట్నం, రెండో పెళ్లి వేధింపులు అధికమని చెప్పారు. అలసత్వం చూపిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
