- సన్న వడ్ల బోనస్ రూ.102 కోట్లకుగాను రూ. 80 కోట్లు జమ
- వానకాలం సీజన్ వడ్ల కొనుగోళ్లు కంప్లీట్
- కామారెడ్డి జిల్లాలో 4,50,660 మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో వానకాలం సీజన్‌కు సంబంధించిన వడ్ల కొనుగోళ్లు కంప్లీట్ అయ్యాయి. దొడ్డు, సన్న రకం కలిపి 4,50,660 మెట్రిక్ టన్నుల వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 1,089 కోట్లు. సన్న రకాలకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 500 ఇచ్చే బోనస్ రూ. 102 కోట్లు కాగా, ఇందులో ఇప్పటికే రూ. 80 కోట్లు రైతుల అకౌంట్లలో జమ అయ్యాయి. జిల్లాలో వానకాలం సీజన్లో 2,85,825 ఎకరాల్లో వరి పంట సాగైంది. ఇందులో దొడ్డు రకం 2,00,077 ఎకరాలు, సన్నరకం 85,748 ఎకరాల్లో సాగైంది.
6 లక్షల 88వేల మెట్రిక్ టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసిన దృష్ట్యా వరి పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని ఏరియాల్లో వరి పంట కొట్టుకుపోవటం, నీట మునగడం విత్తు రాలిపోవటం వంటి పరిస్థితులతో పంట దెబ్బతిని దిగుబడి తగ్గింది. వడ్ల కొనుగోలుకు ప్రభుత్వం 427 సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇందులో 194 ఐకేపీ, 233 సొసైటీ సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా వడ్ల కొనుగోళ్లు జరిగాయి. కాంటాలు పెట్టిన వెంటనే బిల్లులు రైతుల అకౌంట్లలో జమ చేయటానికి చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సివిల్ సప్లయ్ అధికారులు కొనుగోళ్లు సకాలంలో చేపట్టేలా చూశారు. సెంటర్లలో కాంటా కాగానే మిల్లులకు తరలించారు.
రూ.వెయ్యి కోట్లకుపైగా చెల్లింపులు
427 సెంటర్లలో మొత్తం 4,50,660 మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డు రకం 2,45,459 మెట్రిక్ టన్నులు, సన్న రకం 2,05,201 మెట్రిక్ టన్నులు ఉంది. మొత్తం విలువ రూ. 1,089 కోట్లు. ఇప్పటికే రైతుల అకౌంట్లలో రూ.1,083 కోట్లు జమయ్యాయి. మిగతా రూ. 6 కోట్లు ఒకటి, రెండు రోజులు జమ
కాన్నాయి.
రైతుల అకౌంట్లలో రూ. 80 కోట్లు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలో భాగంగా సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ప్రభుత్వం చెల్లిస్తోంది. వానకాలం సీజన్లో 38,667 మంది రైతుల నుంచి 2,05,201 మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేశారు. క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ రూ. 102 కోట్ల 23 లక్షలు అవుతోంది. బోనస్ పైసలు రైతుల అకౌంట్లలో ఇప్పటికే రూ. 80 కోట్లు జమయ్యాయి. ఇంకా రూ.22 కోట్ల 23 లక్షల అమౌంట్‌కు సంబంధించిన వివరాలను జిల్లా అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ అమౌంట్ కూడా రైతుల అకౌంట్లలో జమ కానుంది. బోనస్ ఇస్తున్న నేపథ్యంలో సన్న రకం వరి సాగు విస్తీర్ణం కూడా జిల్లాలో పెరిగింది.
మిగతా అమౌంట్ తొందరలోనే జమ
వడ్ల కొనుగోళ్లకు సంబంధించిన అమౌంట్ త్వరలో జమయ్యేలా చర్యలు తీసుకున్నాం. రూ.1,089 కోట్లలో ఇప్పటికే రూ.1,083 కోట్లు జమ అయ్యింది. మిగతా అమౌంట్ కూడా రిలీజ్ అయ్యింది. రైతుల అకౌంట్లలో జమ చేస్తారు. బోనస్ అమౌంట్ రూ.80 కోట్ల చెల్లింపులు జరిగాయి. మిగతా రూ.22 కోట్లకు సంబంధించి వివరాలు ఉన్నతాధికారులకు నివేదించాం. ఈ అమౌంట్ నేరుగా రైతుల అకౌంట్లలో జమ అవుతుంది. - వెంకటేశ్వర్, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి
