- ప్రైవేట్ థియేటర్లో ఫర్నిచర్ ధ్వంసం
- సిబ్బందిలో ఒకరికి గాయాలు.. కేసు నమోదు
బషీర్‌బాగ్, వెలుగు: బర్త్ డే వేడుకల వీడియో కోసం హిమాయత్‌నగర్‌లోని ప్రైవేట్ థియేటర్లో గొడవ జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 5న నారాయణగూడకు చెందిన భానుప్రసాద్ వారి కుటుంబ సభ్యుల బర్త్ డే వేడుకల కోసం హిమాయత్‌నగర్ లోని జాలీ డిస్ట్రిక్ట్ అనే ప్రైవేట్ థియేటర్ ను బుక్ చేసుకున్నాడు. ఆ వేడుకలకు సంబందించిన వీడియోను ప్రైవేటు థియేటర్ సిబ్బందితో తీయించేందుకు మాట్లాడుకున్నారు. మరుసటి రోజున ఆ వీడియో కోసమని భానుప్రసాద్ థియేటర్ కు వెళ్లగా, అనుకోకుండా ఆ వీడియో డిలీట్ అయిందని సిబ్బంది తెలిపారు.
తనకు ఆ వీడియో ఎలా అయినా కావాలంటూ పలుమార్లు థియేటర్ చుట్టూ తిరిగాడు. ఈ క్రమంలో ఈ నెల 22న అర్ధరాత్రి భానుప్రసాద్ అతని ఇద్దరు కొడుకులతో కలిసి వచ్చి సిబ్బందితో గొడవకు దిగాడు. మాటమాట పెరగడంతో థియేటర్లోని ఫర్నిచర్, పూల కుండీలను ధ్వంసం చేశారు. అడ్డుకోవడానికి వెళ్లిన సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి. దీంతో ప్రైవేటు థియేటర్ యజమాని వివేక్ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
