- మాన్యువల్ పేమెంట్లకు చాన్స్ లేదు
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు, రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ (ఎస్‌ఎఫ్‌సీ) సర్దుబాటు కోసం కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు, మండల ప్రజాపరిషత్‌లు బ్యాంక్ ఖాతాలు తెరవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన సూచించారు. స్థానిక గ్రామీణ సంస్థలకు 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ల విడుదల, వినియోగం విషయంలో ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు.
ఈ నిధుల వినియోగంలో ఇకపై మాన్యువల్ చెల్లింపులకు బదులు అన్ని పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పీఎఫ్‌ఎంఎస్), ఈ-గ్రామ్ స్వరాజ్ పోర్టల్ ద్వారానే జరపాల్సి ఉంటుందని, అన్ని లావాదేవీలు డిజిటల్ ఫ్లోను పాటించాల్సి ఉంటుందని మంగళవారం జడ్పీ సీఈవోలు, డీపీవోలకు పీఆర్‌ఆర్‌డీ డైరెక్టర్ సృజన తెలిపారు. ‘‘ఖాతాల తెరిచేందుకు గ్రామసభ, సర్వసభ్య సమావేశాల్లో తీర్మానం చేయాలి.
రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ల కోసం ప్రత్యేకంగా ఓ బ్యాంక్ ఖాతా ఉండాలి. ఇతర పథకాల నిధులను (ఉపాధి హామీ, ఇతర పథకాలు) వీటితో కలపకూడదు’’అని ఆమె చెప్పారు. కాగా, కొత్త బ్యాంక్ అకౌంట్లు తెరిచేందుకు ఇచ్చిన ఆదేశాల్లో ఉపసర్పంచ్ స్థానంలో పొరబాటున పంచాయతీ కార్యదర్శి అని వచ్చిందన్నారు. అందువల్ల ఈ విషయాన్ని గ్రహించి సవరణకు ఆదేశాలు ఇచ్చామే తప్ప ఉపసర్పంచ్ చెక్ పవర్ తీసేయలేదని క్లారిటీ ఇచ్చారు.
