
పెళ్లి దావత్లో గొడవ..డ్యాన్సులు, బరాత్లతో ఆనందంగా సాగాల్సిన పెళ్లి వేడుక అంతలోనే రణరంగంలా మారింది. వచ్చిన బంధువులంతా రెండు గ్రూపులుగా విడిపోయి తన్నుకున్నారు. కర్రలు, హాకీస్టిక్స్, బ్యాట్లు, ఇనుప రాడ్లు ఇలా చేతికి దొరికిన వస్తువులతో తలలు పగలగొట్టుకున్నారు.పెళ్లి బాజా మోగాల్సిన ఇంట్లో చావు బాజా మోగింది.
యూపీలోని అమేధీ సమీపంలో సారాయ్ హృదయ్ షా అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం(మే5) తెల్లవారు జామున విందులో తందూరీ రోటీ కోసం మొదలైన గొడవలో రవి, ఆశిష్ అనే ఇద్దరు యువకులను కొంతమంది వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘర్షణలో పెళ్లికి వచ్చిన అతిథుల తీవ్రగాయాలయ్యాయి.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పెళ్లిలో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్‌లో తందూరి రోటీల కోసం గొడవ ఏకంగా ఇద్దరు ప్రాణాలు తీసింది. వరుడి బంధువు, అతని స్నేహితులు, మృతులు ఆశీష్, రవిరోహిత్ మధ్య జరిగిన వాగ్వాదం ముదిరి ఇనుపరాడ్లు, కర్రలు, హాకీ స్టిక్స్ తో కొట్టుకున్నారు. గ్రూపులుగా విడిపోయి చితకొట్టుకున్నారు. పెళ్లి ఇల్లు కాస్త రణరంగంలామారింది. ఆశీష్, రవిరోహిత్ లకు తీవ్రగాయాలు కావడంతో చనిపోయారు. కొంతమంది బంధువులు గాయపడ్డారు.
రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం 13మందిపై కేసు నమోదు చేశారు.నిందితులకోసం గాలిస్తున్నారు. వీరిలో ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు.