
- కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం డ్రామాలాడుతున్నయ్: బండి సంజయ్
- మార్వాడీలు వ్యాపారాలు చేసుకుంటే తప్పేముందని ఫైర్
- ‘హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ’కి హాజరు
- ఓట్ల చోరీతో బీజేపీకి సంబంధం లేదు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో మొదలైన ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం.. హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర అని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. మార్వాడీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కమ్యూనిస్టుల ముసుగులో డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. మార్వాడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తే, తాము హిందూ కులవృత్తులను కాపాడటానికి ‘రోహింగ్యాలు గో బ్యాక్’ ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ’లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘మార్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముంది? వాళ్లు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదు. రాష్ట్రాన్ని దోచుకోలేదు. వ్యాపారాలు చేసుకుంటూ సంపద సృష్టిస్తున్నరు. జీడీపీ పెంపులో కీలక పాత్ర పోషిస్తున్నరు.
హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడ్తున్నరు. అలాంటి మార్వాడీలు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్లిపోవాలి?’’అని బండి సంజయ్ ప్రశ్నించారు. హిందూ కులవృత్తులను దెబ్బతీసేలా మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులను ఒక వర్గం వారే నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మార్వాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే... బీజేపీ పక్షాన ఒక వర్గం నిర్వహించే మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులకు వ్యతిరేకంగా తాము కూడా పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఐఎస్ఐ కార్యకలాపాలు సాగిస్తున్నారని నివేదికలు చెప్తున్నా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రోహింగ్యాలతో తెలంగాణకు ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఓట్ల చోరీకి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ‘‘ఓటర్ల జాబితాను రూపొందించేది ఎన్నికల సంఘం. అది రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఒకవేళ ఓట్ల చోరీ బీజేపీ చేతిలో ఉంటే లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 240 ఎంపీ సీట్లు మాత్రమే ఎందుకొస్తయ్? తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ ఎలా గెలిచింది?
ఇండియా కూటమికి 230 సీట్లు ఎలా వచ్చాయి? ఇతరులు గెలిస్తే ప్రజాస్వామ్యం.. మేము గెలిస్తే ఓట్ల చోరీ జరిగినట్టా? కనీస అవగాహన లేకుండా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. పాతబస్తీలో అడ్డగోలుగా దొంగ ఓట్లున్నయ్. ఒక్క ఇంట్లోనే 300 ఓట్లున్నాయి. వాటిని తీసేయాలా? వద్దా? కాంగ్రెస్ సమాధానం చెప్పాలి’’అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మనోహర్ రెడ్డి, సీనియర్ నేత లంక దీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.