తనిఖీల్లో రూ.307 కోట్ల సొత్తు స్వాధీనం

తనిఖీల్లో రూ.307 కోట్ల సొత్తు స్వాధీనం

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో భాగంగా చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.307 కోట్లకు పైగా విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని సీఈవోవికాస్‌‌ రాజ్‌‌ తెలిపారు. ఎన్నికల​షెడ్యూల్ వచ్చిన ఈ నెల 9న నుంచి ఇప్పటి వరకు తనిఖీల్లో నగదు, మద్యం, ఆభరణాలు, కానుకలు పట్టుబడగా, వాటి మొత్తం విలువ రూ.307.2 కోట్లు అని శనివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. అలాగే, శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు రూ.9.69 కోట్ల నగదు పట్టుబడిందని చెప్పారు. కాగా, ఇప్పటి వరకు పట్టుబడిన మొత్తం నగదు రూ.105.58 కోట్లకు చేరింది. సీజ్‌‌ అయిన మద్యం విలువ రూ.13.58 కోట్లు కాగా.. బంగారం, వెండి, వజ్రాల విలువ రూ.145.67 కోట్లుగా ఉంది. వీటితో పాటు రూ.26.93 కోట్ల విలువైన ఇతర కానుకలు కూడా పట్టుబడ్డాయి. 15.23 కోట్ల రూపాయల విలువైన గంజాయి, డ్రగ్స్‌‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇబ్రహీంపట్నంలో 2 కోట్ల విలువైన నగలు సీజ్

ఇబ్రహీంపట్నం/ మేడిపల్లి, వెలుగు: ఎన్నికల కోడ్ అమలులో భాగంగా రంగారెడ్డి జిల్లాల్లో  పోలీసుల వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయి. శనివారం ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్టపై పోలీసులు ఓ కారును ఆపి సెర్చ్ చేయగా.. అందులో సుమారు రూ.2.30 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను గుర్తించారు. అభరణాలు ఉన్న కారు మాదాపూర్​లోని రాయదుర్గం మైహోమ్‌‌‌‌ భుజాలో నివాసముండే మన్నె ఓ మహిళదని అధికారులు తెలిపారు. సరైన పత్రాలు చూపించకపోవడంతో నగలను సీజ్ చేసి ఎన్నికల రిటర్నింగ్​అధికారికి అందజేసినట్లు పేర్కొన్నారు.

బోడుప్పల్ లో రూ.4 కోట్లు సీజ్

మేడ్చల్ జిల్లాలో భారీగా డబ్బు పట్టుబడింది. బోడుప్పల్ కమాన్ వద్ద రూ.3.21 కోట్లు, మేడిపల్లిలోని ఓ షాపింగ్ మాల్ వద్ద రూ.1.32 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బును మేడిపల్లి పోలీసులకు అప్పగించినట్టు ఎస్​వోటీ ఎస్సై రఘురాముడు తెలిపారు.