రిమ్స్‌లో సిజేరియన్లు బంద్

రిమ్స్‌లో  సిజేరియన్లు బంద్

ఆదిలాబాద్,​ వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్​కు సంజీవిని అవుతుందనుకున్న రిమ్స్​ఆసుపత్రి రోగులకు సేవలందించడంలో విఫలమవుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలతోపాటు మహారాష్ట్ర జిల్లాల నుంచి ప్రతిరోజూ రిమ్స్ ఆస్పత్రికి 800 మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తుంటారు. వీరిలో 100 మంది వరకు గైనిక్ సమస్యలతో బాధ పడుతున్నవారు ఉంటున్నారు. గైనిక్ సమస్యలతో వచ్చేవారికి సరైన ట్రీట్మెంట్ అందడం లేదని మహిళలు ఆరోపిస్తున్నారు. సీరియస్​ కండీషన్​లో వచ్చే పేషెంట్లను బయటకు రెఫర్​ చేస్తున్నారనే విషయం పలుసార్లు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. సరిపడా అనస్తీషియనిస్టులు లేరంటూ తాజాగా గైనిక్​ వార్డులో సిజేరియన్లు నిలిపివేశారు. 

11 మంది డాక్టర్లున్నా పట్టింపు లేదు

రిమ్స్​ గైనిక్ ​వార్డులో ఒక హెడ్​ఆఫ్​ డిపార్ట్​మెంట్(హెచ్​వోడీ), అసోసియేట్​ ప్రొఫెసర్, ఐదుగురు అసిస్టెంట్​ ప్రొఫెసర్లు, నలుగురు ట్యూటర్లున్నారు. వీరిలో ఒకరు డిప్యుటేషన్​పై ఇతర ప్రాంతాల్లో పని చేస్తుండగా, పదిమంది ఈ ఒక్క వార్డులోనే ఉంటారు. పలుసార్లు సిజేరియన్​చేయాల్సిన పేషెంట్లను హైదరాబాద్, నాగపూర్​కు రెఫర్ ​చేశారు. శుక్రవారం ముగ్గురికి సిజేరియన్​ చేయాల్సి ఉండగా, అనస్తీషియనిస్టులు లేరంటూ అందరినీ ఇతర ప్రాంతాలకు రెఫర్ చేశారు. అందులో ఒక గర్భిణి చేతిలో డబ్బుల్లేక అక్కడే ఉండిపోయి అధికారులను నిలదీయడంతో విషయం బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వార్త ‘వెలుగు’లో రావడంతో శనివారం జిల్లా కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ రిమ్స్​గైనిక్​ వార్డును సందర్శించారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుని డీఎంఈకి లెటర్​ రాశారు. ఇకపై ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవద్దని, అన్ని వేళలా డాక్టర్లు అలర్ట్​గా ఉండి రోగులకు సేవలందించాలని సూచించారు.

అనస్తీషియనిస్టు ఒక్కరే..

రిమ్స్​ఆసుపత్రిలో గత సంవత్సరం మొత్తం ఐదుగురు అనస్తీషియనిస్టులు పని చేసేవారు. వారిలో ఇద్దరు హైదరాబాద్ ​నుంచి వచ్చారు. అయితే వారిని ఇక్కడ పనిచేసే కొందరు లోకల్​డాక్టర్లు, రాజకీయ నేతలు ముప్పుతిప్పలు పెట్టి వెళ్లిపోయేలా చేశారనేది డాక్టర్ల వాదన. వారు ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ముగ్గురిలో ఇద్దరు లీవ్​ తీసుకోగా ఒక్కరే మిగిలారు. దాంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. స్థానికంగా ఉండే కొందరు డాక్టర్లు రాజకీయాలు చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని స్వయంగా ఉన్నతాధికారులే చెబుతుండడం గమనార్హం. 

అంతా సెట్​ చేస్తున్నా

నేను ఇక్కడికి వచ్చి నెలరోజులే అవుతోంది. నేను వచ్చేసరికే ఇక్కడ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఇపుడిపుడే ఒక్కో వింగ్ ​వారీగా డాక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి సెట్​ చేసే ప్రయత్నం చేస్తున్నా. అందరూ సహకరిస్తే త్వరలో రిమ్స్​ బాగు పడుతుంది.
 - కరుణాకర్, రిమ్స్​ డైరెక్టర్​