సెస్ చైర్మన్​గా చిక్కాల రామారావు

సెస్ చైర్మన్​గా చిక్కాల రామారావు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ(సెస్) కొత్త పాలకవర్గం కొలువుదీరింది. గతంలో చైర్మన్ గా పని చేసిన చిక్కాల రామారావు తిరిగి చైర్మన్​గా, కోనరావుపేట మండలం నుంచి డెరెక్టర్ గా గెలుపొందిన దేవరకొండ తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్ గా మంగళవారం నామినేషన్ ​వేశారు. వేరే నామినేషన్లు రాకపోవడంతో సెస్ ఎలక్షన్​ఆఫీసర్​మమత వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు.ఈ సందర్భంగా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ గత అనుభవంతో సెస్​ను లాభాల బాటలోకి తీసుకొస్తానన్నారు.  సెస్ పరిధిలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి సమస్యలు పరిష్కరిస్తానన్నారు. చైర్మన్ ఎన్నిక తర్వాత 14 మంది డైరెక్టర్లు, బీఆర్​ఎస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా, టెక్స్ టైల్ పవర్​లూం కార్పొరేషన్​చైర్మన్  గుడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్ఎస్  సీనియర్ లీడర్​చీటి నర్సింగ్ రావు, జిందం చక్రపాణి, డీసీఓ బుద్దనాయుడు,సెస్ ఎండీ రామకృష్ణ పాల్గొన్నారు.  

పద్మశాలీలను మరిచిన కేటీఆర్ 

సెస్ డైరెక్టర్లు సిరిసిల్ల నుంచి ఇద్దరు పద్మశాలీలు గెలిచినా..కేటీఆర్ ఒక్కరికి కూడా సెస్ వైస్ చైర్మన్ పదవి ఇవ్వలేదు. దీంతో సిరిసిల్ల పద్మశాలీలు గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. దీనిపై కొంత మంది పద్మశాలీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. పద్మశాలీలకు గౌరవం దక్కలేదని అసహనం వ్యక్తం చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్లలో ఏదో ఒక్క పదవిని పద్మశాలీలు ఆశించగా, అది నేరవేరకపోవడంతో నారాజయ్యారు. సెస్ ఎన్నికల్లో మద్దతు ప్రకటించి రెండు సీట్లలో గెలిచినా తమను కేటీఆర్ గుర్తించలేదని పద్మశాలీ నాయకులు వాపోతున్నారు.