ఇది నడిగడ్డ.. బట్టలు ఊడదీసి కొడ్తం

ఇది నడిగడ్డ.. బట్టలు ఊడదీసి కొడ్తం
  • గద్వాల మున్సిపల్ ఆఫీసర్లపై చైర్మన్ కేశవ్ ఫైర్
  • ఏ రూల్ ప్రకారం డబ్బులు వసూలు చేశారు 
  • రసాభాసగా మున్సిపల్ షాపుల వేలం పాట 
  • సారీ చెప్పి.. వేలం పాటను రద్దు చేసిన కమిషనర్

గద్వాల, వెలుగు: ‘ఇది నడిగడ్డ..  మంచిగా ఉన్నన్ని రోజులు ఏమనం.. తిక్క రేగిందంటే.. అవినీతి ఆఫీసర్లను నడిరోడ్డుపై  ఉరికించి బట్టలు ఊడదీసి కొడతం’  అని మున్సిపల్ చైర్మన్ బీఎస్‌‌‌‌ కేశవ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.  ఆఫీసర్ల అవినీతి చిట్టా తన దగ్గర ఉందని, తిక్క తిక్క వేషాలు వేయొద్దని హెచ్చరించారు.  సోమవారం గద్వాల మున్సిపాలిటీకి సంబంధించి 36 షాపుల వేలం పాటను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే మున్సిపల్ ఆఫీసర్లు కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా, రూల్స్ కు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడంతో మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిల్ సభ్యులు  సీరియస్ అయ్యారు. ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగడంతో వేలంపాట కార్యక్రమం రసాభాసగా మారింది. 
మున్సిపల్ కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా...
గద్వాల మున్సిపాలిటీలోని 36 షాపులను వేలం వేయాలని కౌన్సిల్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. రూ. 50 వేల  డీడీ  కట్టి, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ నుంచి సాల్వెన్స్ సర్టిఫికెట్ తీసుకొచ్చి మున్సిపాలిటీలో సబ్మిట్ చేయాలని తీర్మానం చేశారు. ఇందుకు అనుగుణంగా నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. కానీ మున్సిపల్ కౌన్సిల్, చైర్మన్ కు తెలియకుండా ఆఫీసర్లు డీడీ కాకుండా నగదు తీసుకున్నారు. అంతేకాకుండా షాపులను కేటగిరీలుగా విభజించి ఒక్కొక్క కేటగిరీకి రూ. లక్ష నుంచి రూ. 3 లక్షలు వరకు డిపాజిట్ తీసుకున్నారు. రూల్స్ మార్చడంతో  దాదాపు 130 మంది వరకు షాపులు కావాలంటూ అప్లికేషన్ పెట్టుకోగా..  రూ.  కోటికి పైగానే వసూలు చేశారు.  ఈ డబ్బుకు మున్సిపాలిటీ నుంచి రసీదు కూడా ఇవ్వలేదు. తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో కాకుండా మున్సిపాలిటీలోనే సాల్వెన్స్ సర్టిఫికెట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.  దీంతో  చైర్మన్‌‌‌‌, కౌన్సిల్‌‌‌‌ సభ్యులు ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగారు.  అరుపులు, కేకలు, వాగ్వాదాలతో గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. సీఐ హనుమంతుతో పాటు ఇద్దరు ఎస్సైలు, సిబ్బంది  అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
‘చట్టంలో ఉంటే రాసివ్వండి’
చట్టం ఏమన్నా ఆఫీసర్ల సైడ్ ఉన్నదా అని చైర్మన్ నిలదీశారు.  కౌన్సిల్‌‌‌‌కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవచ్చని ఉంటే తమకు రాసి ఇచ్చి టెండర్ నిర్వహించుకోవచ్చని తేల్చిచెప్పారు.  రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదని, ఇక్కడ మాత్రం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ కౌన్సిల్  తలదించుకునే పరిస్థితి తీసుకువస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  36 షాపుల వేలం లో ఏడు షాపుల వివాదం కోర్టు లో ఉన్నదని,  వాటికి ఎలా టెండర్ వేస్తారని పలువురు కౌన్సిలర్లు ఆఫీసర్లను ప్రశ్నించారు.  
పోలీసులను పెట్టుకొని దౌర్జన్యం చేస్తారా?
పోలీసులను పెట్టుకొని తమను లోపలికి రానివ్వకుండా దౌర్జన్యం చేశారని పలువురు కౌన్సిలర్లు వాపోయారు.    కొందరు కౌన్సిలర్లను బయటికి కూడా గెంటి వేయించారని ఆరోపించారు. మున్సిపాలిటీలో జరిగే షాపుల వేలానికి కౌన్సిలర్లను కూడా అడ్డుకునే పరిస్థితి వచ్చిందంటే ఆఫీసర్ల తీరు ఏవిధంగా ఉందో అర్థం 
చేసుకోవచ్చన్నారు. 
సారీ చెప్పిన కమిషనర్
మున్సిపల్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లోకి రాకుండా పోలీసులు అడ్డుకోవడంపై కౌన్సిలర్లకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సారీ చెప్పారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. వేలంపాట నిర్వహించాలా.. వద్దా..?  అనే విషయంపై చైర్మన్‌‌‌‌, మున్సిపల్ కమిషనర్ మేనేజర్లు ఆఫీస్ లోకి వెళ్లి చర్చలు జరిపారు.  ఎటూ తేలకపోవడంతో వేలం పాటను రద్దు చేస్తున్నామని,  ఎప్పుడు నిర్వహించేది నోటిఫికేషన్ ద్వారా ప్రకటిస్తామని తెలిపారు.