వర్సిటీల పాలనలో నాయకత్వ శూన్యత: చైర్మన్ లింబాద్రి

వర్సిటీల పాలనలో నాయకత్వ శూన్యత: చైర్మన్ లింబాద్రి

సికింద్రాబాద్, వెలుగు: విశ్వవిద్యాలయాల్లోని అకడమిక్ పరిపాలనలో నాయకత్వ శూన్యత ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. రానున్నకాలంలో  వర్సిటీల్లో  నాయకత్వం వహించే అవకాశాలను ఓయూ అధ్యాపకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓయూలో నిర్వహించిన అకడమిక్ నాయకత్వ శిక్షణ ముగింపు కార్యక్రమానికి  బుధ వారం ఆయన హాజరై మాట్లాడారు. అధ్యాపకులకు స్పష్టమైన అవగాహన, పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలకు లోబడి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలని స్పష్టం చేశారు. 

త్వరలోనే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల అధ్యాపకులకు ఈ తరహాలో ఉన్నత విద్యామండలి నేతృత్వంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వారం రోజులపాటు శిక్షణలో పాల్గొన్న ప్రొఫెసర్లు ఈ సందర్భంగా తమ అనుభవాలను పంచుకున్నారు. నూతన ఉత్తేజంతో ఆయా విభాగాలకు నాయకత్వం వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో  ఓయూ వీసీ ప్రొఫెసర్​ రవీందర్, రిజిస్ర్టార్ ప్రొఫెసర్​ లక్ష్మినారాయణ  పాల్గొన్నారు.