- ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కో చైర్మన్ చెన్నయ్య
- సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తం
- నేడు కలెక్టరేట్ల వద్ద ధర్నాకు పిలుపు
ఖైరతాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ విషయంలో వచ్చిన తీర్పు సుప్రీం కోర్టుది కాదని.. మోదీ తీర్పు అని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కో చైర్మన్ గండమల్ల చెన్నయ్య విమర్శించారు. ఈ తీర్పు వెనుకాల చంద్రబాబు, కిషన్ రెడ్డి, వెంకయ్య నాయుడు ఉన్నారని ఆరోపించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి చైర్మన్ సర్వయ్య అధ్యక్షతన వహించారు.
చెన్నయ్య మాట్లాడుతూ గతంలో వర్గీకరణ చెల్లదని తీర్పు ఇచ్చిన సుప్రీం.. రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని తాజాగా తీర్పు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ‘‘ఎస్సీ వర్గీకరణతో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. తీర్పును ఖండిస్తున్నం. మాలలందరూ ఐక్యంగా పోరాడాలి. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసి వర్గీకరణను అడ్డుకుంటాం’’అని అన్నారు. బీజేపీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.
ఏపీ సీఎం చంద్రబాబు మాలల ద్రోహిగా మిగిలిపోతారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాల సంఘాలన్నీ సోమవారం అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాకు దిగాలని పిలుపునిచ్చారు. ఈ నెల 7, 8, 9, 10వ తేదీల్లో ‘హలో మాల.. చలో ఢిల్లీ’ పేరుతో జంతర్ -మంతర్ వద్ద ధర్నా చేస్తామన్నారు.