HMDA విలీన ప్రాంతాల్లో కష్టాలు..పెండింగ్ లో డీటీసీపీ పర్మిషన్లు

HMDA విలీన ప్రాంతాల్లో కష్టాలు..పెండింగ్ లో డీటీసీపీ పర్మిషన్లు
  • మాస్టర్​ప్లాన్​ లేకనే అంటున్న ఆఫీసర్లు  
  • 600 అప్లికేషన్లు వస్తే 200కే అనుమతులు 
  • మరో ఆరు నెలలు పట్టే అవకాశం

హైదరాబాద్​సిటీ, వెలుగు: హెచ్ఎండీఏ పరిధిలో  కొత్తగా విలీనమైన ప్రాంతాల్లోని భవన నిర్మాణదారులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. విలీనం కాకముందు ఆయా స్థానిక సంస్థల నుంచి డీటీసీపీ పర్మిషన్లు తీసుకునేవారు. కానీ, హెచ్ఎండీఏలతో విలీనమైన తర్వాత డీటీసీపీ భవన నిర్మాణాలు, లే అవుట్ల పర్మిషన్ల జారీని బంద్​చేశారు. 

దీంతో హెచ్ఎండీఏ పరిధిలోకి వెళ్లిందని నిర్మాణదారులు దరఖాస్తు చేసుకుంటున్నా కొత్తగా విలీనమైన ప్రాంతానికి మాస్టర్​ప్లాన్​, జోనల్​ప్లాన్​లేకపోవడంతో పెండింగ్​లో పెడుతున్నారు. దీంతో విలీన ప్రాంతాల్లోని నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తులు అప్రూవ్​కాక ప్రాజెక్టులు పెండింగ్​లో ఉండి నష్టపోతున్నామని వాపోతున్నారు. 

7 వేల నుంచి 11 వేల కిలోమీటర్లకు..

ఇంతకుముందు ఔటర్​వరకూ 7,257 చ.కి.మీ.ల పరిధిలో విస్తరించిన హెచ్ఎండీఏ మాస్టర్​ప్లాన్, జోనల్ ప్లాన్లు ఉండడంతో భారీ నిర్మాణాలు, కొత్త లేఅవుట్లకు నివాస, పారిశ్రామిక, కన్జర్వేషన్​, బయో కన్జర్వేషన్​ కేటగిరీల్లో అనుమతులు ఇస్తోంది. కానీ, కొద్దికాలం కింద హెచ్ఎండీఏ పరిధి ట్రిపుల్​ఆర్​వరకు పెరిగింది. ఏడు జిల్లాలకు తోడు మరో నాలుగు జిల్లాలు నల్గొండ, మహబూబ్​నగర్, నాగర్​ కర్నూల్, వికారాబాద్, మరో 104 మండలాలు,1355 గ్రామాలు వచ్చి చేరాయి. 

దీంతో హెచ్ఎండీఏ పరిధి 11,357 చ. కిలోమీటర్లకు విస్తరించింది. అలాగే, ఇప్పటి వరకూ విలీన ప్రాంతాల్లో కొత్తగా భవన నిర్మాణాలు, లేఅవుట్స్​కు సంబంధించిన అనుమతులన్నీ డైరెక్టర్​టౌన్​అండ్​కంట్రీ ప్లానింగ్​(డీటీసీపీ) ఇచ్చేది. ఆయా ప్రాంతాలు హెచ్ఎండీఏలో విలీనం కావడంతో డీటీసీపీ నిర్మాణాల అనుమతుల జారీ అధికారం వారికి పోయి హెచ్ఎండీఏకు వచ్చింది. 

భూములకు భారీ డిమాండ్​ ఉండడంతో..

హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చిన ప్రాంతాల్లో భూములకు భారీ డిమాండ్​ఏర్పడింది. కొత్తగా భూములు కొనాలనుకునేవారు ట్రిపుర్​ఆర్​పరిధిలోనే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రియల్​ఎస్టేట్ ​వ్యాపారులు కొత్త లేఅవుట్స్​ ​వేస్తున్నారు.వీటి ​పర్మిషన్ల కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే, విలీనం జరిగిన ఈ ఆరు నెలల్లో హెచ్ఎండీఏకు 600పైగా దరఖాస్తులు రాగా కేవలం 200లోపు అప్లికేషన్లకు మాత్రమే పర్మిషన్లు ఇచ్చింది. 

మిగిలిన వాటికి ఆయా ప్రాంతాలు ఏ జోన్ పరిధిలోకి వస్తాయో పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇస్తామని చెప్తోంది. ఈ విషయమై అధికారులను అడితే.. విలీన ప్రాంతాలతో కలిపి మెగా మాస్టర్​ప్లాన్​ రూపొందిస్తున్నామని, అమలులోకి రావడానికి మరో ఆరు నెలలు పడుతుందని చెప్తున్నారు.