బీజేపీ, బీఆర్ఎస్ చీకటి దోస్తానా! : పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్

బీజేపీ, బీఆర్ఎస్ చీకటి దోస్తానా! :  పీసీసీ ప్రధాన కార్యదర్శి  చనగాని దయాకర్
  •     పీసీసీ ప్రధాన కార్యదర్శి  చనగాని దయాకర్ ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సోమవారం జరిగిన మున్సిపల్, మేయర్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ చీకటి దోస్తానా మరోసారి బయటపడిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. సోమవారం గాంధీ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ఓటింగ్ కు దూరంగా ఉందని ఆరోపించారు. అక్కడ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రహాస్య ఒప్పందాలను జనంలోకి తీసుకెళ్తామన్నారు. కాళేశ్వరం అవినీతికి బీజేపీ మద్దతుగా నిలిచిందని ఈ ఎన్నిక ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు. 

అందుకే కేసీఆర్.. బీజేపీకి బహుమానంగా కరీంనగర్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఓటింగ్ కు దూరంగా ఉంచారని విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్​కి బీఆర్ఎస్ అండగా నిలిచిందంటే కేసీఆర్ అవినీతికి బీజేపీ అండగా నిలిచినట్లేనన్నారు. రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కారు గుర్తుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. 

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ కు  ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా ఆ పార్టీ నేతలకు ఏమాత్రం బుద్ధిరాలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, సీఎం రేవంత్ రెడ్డికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని సూచించారు.