హైదరాబాద్‌లో ఐపీఎల్!

హైదరాబాద్‌లో ఐపీఎల్!

అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే ఐపీఎల్‌‌ 14 ఎడిషన్‌‌ మ్యాచ్‌‌లను హైదరాబాద్‌‌ ఫ్యాన్స్‌‌  స్టేడియంకు వెళ్లి లైవ్‌‌లో ఎంజాయ్‌‌ చేయనున్నారు. కరోనా ముప్పు  పొంచి ఉన్న నేపథ్యంలో కొత్త సీజన్​ను ‌ నిర్వహించేందుకు బీసీసీఐ నాలుగైదు సిటీల పేర్లను పరిశీలిస్తోంది. ఇందులో ముంబైతోపాటు హైదరాబాద్‌‌, బెంగళూరు, కోల్‌‌కతా, అహ్మదాబాద్‌‌ ఉన్నాయి. కరోనా దెబ్బకు ఐపీఎల్‌‌ 13ను యూఏఈలో నిర్వహించిన బోర్డు.. ఏప్రిల్‌‌ రెండో వారంలో స్టార్ట్‌‌ చేయాలని భావిస్తున్న కొత్త ఎడిషన్‌‌ను ఇండియాలోనే పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది. ముంబై వేదికగా టోర్నీ మొత్తాన్ని  నిర్వహించాలని ఇన్నాళ్లూ  భావించారు. ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్‌‌, డీవై పాటిల్‌‌, రిలయన్స్‌‌ స్టేడియాల్లో మ్యాచ్‌‌లు కండక్ట్‌‌ చేయాలని అనుకున్నారు. అయితే, మహారాష్ట్ర  వ్యాప్తంగా ఇటీవల కరోనా పాజిటివ్‌‌ కేసులు పెరుగుతుండటంతో బోర్డు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది.  ఇందులో భాగంగా  వేరే నగరాలను పరిగణనలోకి తీసుకుంటోంది. అందులో హైదరాబాద్‌‌ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.  ‘ఐపీఎల్‌‌ ప్రారంభానికి ఇంకా నెల రోజులకు పైగా టైముంది. కానీ ఆ లోపే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి కొనసాగితే..  ముంబై వేదికగా టోర్నీ మొత్తాన్ని నిర్వహించాలనుకుంటే అది రిస్క్‌‌ అవుతుంది. మరోపక్క హైదరాబాద్‌‌, బెంగళూరు, కోల్‌‌కతా నగరాలు ఐపీఎల్‌‌కు ఆతిథ్యమిచ్చేందుకు రెడీగా ఉన్నాయి. ప్లే ఆఫ్స్‌‌, ఫైనల్‌‌ మ్యాచ్‌‌లు అహ్మదాబాద్‌‌లో జరిగే చాన్స్‌‌ ఉంది’ అని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్‌‌ అధికారి తెలిపారు.