ఈవీలపై సుంకాలు తగ్గే చాన్స్‌‌‌‌

ఈవీలపై సుంకాలు తగ్గే చాన్స్‌‌‌‌
  • లాబీయింగ్‌‌‌‌ చేస్తున్న టెస్లా
  • చర్చిస్తున్న కేంద్రం

న్యూఢిల్లీ: త్వరలో మనదేశంలో బిజినెస్‌‌‌‌ మొదలుపెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న అమెరికా ఎలక్ట్రిక్‌‌‌‌ వెహికల్‌‌  కంపెనీ టెస్లా.. దిగుమతుల సుంకాల తగ్గింపు కోసం చేస్తున్న లాబీయింగ్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈవీల దిగుమతులపై ప్రస్తుతం వేస్తున్న 60 శాతం సుంకాన్ని తగ్గించాలని కంపెనీ బాస్‌‌‌‌ ఎలాన్ మస్క్‌‌‌‌ ఎన్‌‌డీఏ ప్రభుత్వాన్ని కోరారు. టెస్లా ప్రపోజల్‌‌‌‌ను కేంద్రం సీరియస్‌‌‌‌గా పరిశీలిస్తోందని ఈ సంగతి తెలిసిన ఇద్దరు బ్యూరోకాట్లు ‘రాయిటర్స్‌‌‌‌’ వార్తాసంస్థకు వెల్లడించారు. ఈవీల దిగుమతులపై సుంకాలను 60 శాతం నుంచి 40 శాతానికి తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 40 వేల డాలర్ల (దాదాపు రూ.30 లక్షలు) కంటే ఎక్కువ రేటు  ఉండే ఈవీలకు సుంకం తగ్గింపు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే కేంద్రం తుది నిర్ణయం తీసుకోలేదని, ప్రపోజల్స్‌‌‌‌పై చర్చలు అయితే జరుగుతున్నాయని మరో సీనియర్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ వివరించారు. ‘‘కేంద్ర ఫైనాన్స్‌‌‌‌, కామర్స్‌‌‌‌ మినిస్ట్రీలు, నీతి ఆయోగ్‌‌‌‌ చర్చలు జరుపుతున్నాయి. ఈ విషయంతో సంబంధం ఉన్న అన్ని విభాగాలతోనూ మాట్లాడుతున్నాయి’’ అని పేర్కొన్నారు.

సుంకాలు తగ్గితే..
ఈవీల దిగుమతులపై సుంకాలను తగ్గిస్తే దేశ ఎకానమీకి ఎంతో మేలు జరుగుతుందనే వాదనలూ వినిపిస్తున్నాయి. సుంకాల భారం తక్కువైతే, తాము ఇండియాలోనూ ప్లాంటు పెడతామని టెస్లా ఇది వరకే ప్రకటించింది. దీనివల్ల లోకల్స్‌‌‌‌కు మేలు జరుగుతుందని, ప్రభుత్వానికి అదనంగా ఆదాయం వస్తుందని అంటున్నారు. ‘‘మనదేశానికి లగ్జరీ ఈవీలు పెద్దగా దిగుమతి కావడం లేదు. సుంకం తగ్గించినా సమస్యలు ఉండవు. అయితే ఇలా తగ్గించడం వల్ల మనం లాభం పొందగలగాలి. లోకల్‌‌‌‌ కంపెనీలూ ఇబ్బందిపడకుండా చూడాలి’’ అని ఒక ఆఫీసర్‌‌‌‌ అన్నారు. గతంలో బెంజ్‌‌‌‌, ఆడి వంటివి కూడా సుంకాల తగ్గింపునకు లాబీయింగ్‌‌‌‌ చేసినా, డొమెస్టిక్ కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందుకే లగ్జరీ కార్ల మార్కెట్‌‌‌‌ పెద్దగా పెరగడం లేదు. సంవత్సర అమ్మకాలు 35 వేల యూనిట్లు దాటడం లేదు. అయితే టెస్లా ప్రపోజల్‌‌‌‌ను హ్యుండై, బెంజ్‌‌‌‌ వంటి కంపెనీలు సమర్థించాయి. టాటా, ఓలా వంటివి మాత్రం సుంకాల తగ్గింపు వద్దని, దీనివల్ల తమ అమ్మకాలు తగ్గే ప్రమాదం ఉందని అంటున్నాయి. దీంతో ప్రభుత్వం అన్ని ప్రపోజల్స్‌‌‌‌నూ పరిశీలిస్తోంది. సుంకాన్ని తగ్గించినా, కార్ల విడిభాగాలను మాత్రం ఇండియా నుంచే కొనాలని షరతు పెట్టే అవకాశాలు ఉన్నాయి.   కాలిఫోర్నియాకు చెందిన టెస్లా  మనదేశంలో ఈ ఏడాది నుంచే అమ్మకాలను ప్రారంభించాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. బెంగళూరులో ఒక ఆఫీసును కూడా ఏర్పాటు చేసింది.  తన వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో హిందీ భాషనూ చేర్చింది.

కార్లకు ఇండియా ఐదో అతిపెద్ద మార్కెట్‌‌‌‌
కార్లకు అతిపెద్ద మార్కెట్లలో ఇండియాది ఐదోస్థానం. మన దగ్గర ఏటా దాదాపు 30 లక్షల కార్లు అమ్ముడవుతున్నాయి. అయితే మెజారిటీ కార్ల రేటు 20 వేల డాలర్ల (దాదాపు రూ.15 లక్షలు) కంటే తక్కువే!  లగ్జరీ కార్ల అమ్మకాలు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి. సుంకాలను 40 శాతానికి తగ్గిస్తే లగ్జరీ ఈవీల అమ్మకాలు పెరుగుతాయని, జనం వీటిని కొనడానికి మరింత ఆసక్తి చూపుతారని టెస్లా ఎన్‌‌డీయే గవర్నమెంటుకు సూచించింది. ఈవీలను లోకల్‌‌‌‌గా తయారు చేసేలా ప్రభుత్వం కంపెనీలను ఎంకరేజ్‌‌‌‌ చేస్తోంది. ఇటువంటి సమయంలో విదేశాల నుంచి వచ్చే కార్లకు సుంకాలు తగ్గించొద్దని డొమెస్టిక్‌‌‌‌  కంపెనీలు విమర్శిస్తున్నాయి.